తెలంగాణ కేబినెట్ భేటీలో ఓమిక్రాన్ వేరియంట్ పై చర్చించిన సీఎం కేసీఆర్.. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్య శాఖను ఆదేశించారు. మహబూబ్ నగర్, నారాయణపేట్, గద్వాల్, కొమరం భీమ్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. అటు మంత్రులంతా జిల్లాల్లో పర్యటించి తాజా పరిస్థితిపై సమీక్షించాలన్నారు. ఎలాంటి విపత్తునైనా.. ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.

అంతేకాదు ప్రజారోగ్యం, కరోనా టీకాల పురోగతి, మందుల లభ్యత, ఆక్సిజన్ బెడ్స్ సామర్థ్యం లాంటి అంశాలపై చర్చించారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పట్ల జాగ్రత్తగా ఉండాలని.. అన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ను ఎదుర్కొనే చర్యలు సిఫార్సు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీకి మంత్రి హరీశ్ రావు నేతృత్వం వహిస్తున్నారు. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, సబితా సభ్యులుగా ఉన్నారు. కరోనా నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ వేగవంతం చేసే చర్యలపై ఈ ఉపసంఘం ప్రభుత్వాన్ని సిఫార్సులు చేయనుంది.

ఇక విద్యా సంస్థల్లో కొవిడ్ కేసులపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొన్ని విద్యాసంస్థల్లో కేసులు వస్తున్నాయనీ.. విద్యార్థులందరికీ టెస్టులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడాల్సిన పనిలేదన్నారు. విద్యార్థులు తరగతి గదిలో భౌతిక దూరం పాటించాలని మంత్రి సూచించారు. మాస్కులు ధరించాలనీ.. హాస్టల్ విద్యార్థులు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. సిబ్బంది తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.

అయితే సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. 42మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలు కరోనా బారిన పడ్డారు. ఈ గురుకుల పాఠశాలలో మొత్తం 491మంది విద్యార్థులు, 27మంది సిబ్బందికి టెస్టులు చేయగా.. 40మందికి కరోనా నిర్దారణ అయింది. మిగతా వారికి ఈ రోజు టెస్టులు చేయగా.. కరోనా బారినపడ్డ వారిని హాస్టల్ లోనే క్వారంటైన్ లో ఉంచారు.మరింత సమాచారం తెలుసుకోండి: