ఏపీలో ఒమిక్రాన్ కేసులు ఇంతవరకూ నమోదు కాలేదు. శ్రీకాకుళం జిల్లాలో ఓ కేసు వెలుగు చూసినప్పటికీ తాజాగా చేసిన పరీక్షల్లో ఆ వ్యక్తికి కూడా నెగిటివ్ వచ్చేసింది. అయితే ఏపీలో కొత్త వేరియంట్ కేసులు వచ్చాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఇలా ప్రచారం జరిగిన ప్రతీసారి అధికారులు ఖండిస్తూనే ఉన్నారు. వివరణ ఇస్తూనే ప్రజల్లో అవహగాన కల్పిస్తున్నారు. ఇంతలా అవగాహన కల్పిస్తున్నప్పటికీ అధికారుల్లో మాత్రం ఆందోళన తగ్గడం లేదు. ఎక్కడ కొత్త వేరియంట్ వెలుగు చూస్తుందోనని క్షణక్షణం భయపడిపోతున్నారు. ఏ జిల్లాలో ఒమిక్రాన్ మొదట బయటపడుతుందోనని అటు అధికారులు, వైద్య సిబ్బంది కూడా హడలిపోతున్నారు. తమ జిల్లాల్లో కేసులు రాకుండా ఉంటే చాలు అని అనుకుంటున్నారు.

దేశంలో ఎన్ని కేసులున్నాయి..?
మన దేశంలో ప్రస్తుతానికి కొత్త వేరియంట్ కేసులు 38 నమోదయ్యాయి. వీరందరికీ అధికారులు ప్రత్యేక వైద్య సేవలను అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కొత్త వేరియంట్ వచ్చిన రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్, కేరళ, చండీఘడ్, మహారాష్ట్ర, కర్నాటక కూడా ఉన్నాయి. కొత్త వేరియంట్ వచ్చిన వారంతా విదేశాల నుంచి వచ్చినవారేనని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయా రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. విదేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించాకే బయటికి పంపాలని ఆదేశాలు ఇచ్చారు. విదేశాల నుంచి మన రాష్ట్ర చిరునామాతో దాదాపుగా 15 వేల మంది ఇటీవల వచ్చారు. వీరందిరికీ వైద్య ఆరోగ్య శాఖ పరీక్షలు నిర్వహిస్తోంది. వీరిలో కేవలం పదహారు మందికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. వీరికి సోకింది కేవలం పాత వేరియంట్ మాత్రమేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.

ఏపీ సన్నద్ధత ఎంత..?
ఒకవేళ ఏపీలో కొత్త వేరియంట్ వస్తే అధికారులు ఏం చేయాలనే అంశంపైనా ఇప్పటికే కసరత్తులు పూర్తయినట్టుగా తెలుస్తోంది. ప్రతీ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రజలు మాత్రం మరింత అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో చాలా వరకూ టీకాల పంపిణీ పూర్తయింది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు.

ఒమిక్రాన్ బయటపడితే ఏపీలో ఆంక్షలు పెరుగుతాయా..?
రాష్ట్రంలో ఇప్పటికే ఆంక్షలు అమల్లోకి వచ్చేశాయి. కొత్త వేరియంట్ వస్తుందనే సమాచారంతో అధికారులు ఇప్పటికే నిబంధనలు విధించారు. మాస్క్ లేకుండా కనిపిస్తే వంద రూపాయల జరిమానా విధిస్తామని ప్రకటించారు. దుకాణాలు, షాపింగ్ మాల్స్ లోకి మాస్క్ లేకుండా ప్రవేశిస్తే.. దుకాణాల యజమానులకు భారీ ఎత్తున జరిమానాలు విధిస్తామని కూడా ప్రకటించారు. మరోవైపు పెళ్లిళ్లకు, ఇతర వేడుకలకు 500 మంది మించకూడదని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: