సినిమా టికెట్లు సరే.. మిగతావాటి సంగతేంటి..?
ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా అన్ని వస్తువుల రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. కానీ ఏపీలో నిర్మాణాలకు అవసరమైన ఇసుక రేటు కూడా భారీగా పెరిగిపోయింది. విశాలమైన నదీ తీరాలు, అందుబాటులో ఇసుక ఉన్నా కూడా పేద, మధ్యతరగతి ప్రజలకు అది పెను భారంగా మారింది. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. మరి అన్నిట్నీ పక్కనపెట్టి సినిమా టికెట్ల రేట్లు తగ్గించాల్సిన అవసరం ఏమొచ్చింది. సరిగ్గా సగటు మనిషి ఇదే ప్రశ్న అడుగుతున్నారు.
ప్రభుత్వం వాదన మరోలా ఉంది. వస్తువుల, వస్తు సేవల రేట్లు తగ్గితే ప్రజలు సంబరపడాలి కానీ, కొంతమంది ఇలా వ్యతిరేకించడం ఏంటనేది ప్రభుత్వం వాదన. సినిమా టికెట్లతోపాటు, ఫలానా వస్తువుల రేట్లు తగ్గించండి అని అడిగితే పర్లేదు కానీ, దాన్ని మాత్రమే ఎందుకు తగ్గించారని ప్రశ్నిస్తే ఏం చేస్తామంటున్నారు మంత్రులు. కానీ ప్రజల్లో మాత్రం సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు ఆశించినంత పాజిటివ్ మూడ్ ని తీసుకురాలేకపోయింది. ఎప్పుడో ఒకసారి వెళ్లే సినిమా టికెట్ రేట్లను తగ్గించడంలో, ఆ వివాదంలో కోర్టులో న్యాయపోరాటం చేయడంపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ, నిత్యావసరాల విషయంలో ఏమైందని నిలదీస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంలో సరైన కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా దీనిపై అర్థవంతమైన చర్చ జరుగుతోంది. నిత్యావసరాలు ఆకాశాన్నంటుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందనే ప్రశ్న వస్తోంది. ఎరక్కపోయి ఇరుక్కుపోయింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం. సినిమా టికెట్ రేట్లు తగ్గించి, మిగతా వాటితో లేనిపోని పోలిక తెచ్చుకుంది. అనుకోని డిమాండ్లు ఎదురవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి