కరోనా కొత్త వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికే ప్రపంచదేశాలన్నిటిలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న కేసులను చూస్తున్న వైద్యులు వీటిని థర్డ్ వేవ్ కు సంకేతాలుగా చెబుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కరోనాపై చేసిన ఓ నివేదిక కొంచెం ప్రశాంతతను కలిగిస్తోంది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే సమయంలో గాలిలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ ప్రయాణంలో వైరస్ 20 నిమిషాల పాటుగా గాలిలో ఉంటే, 90 శాతం దాని సామర్ధ్యం కోల్పోతోందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అదే విధంగా గాలిలో ఉన్న వైరస్ మొదటి ఐదు నిమిషాలలోనే ఒకరి నుంచి మరొకరికి సోకే సామర్ధ్యాన్ని కూడా కోల్పోతోందట.

యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన ఏరోసోల్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో గత కొంత కాలంగా కరోనా వైరస్ మార్పు చెందే విధానంపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో కరోనా వైరస్ గురించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఐదు నిమిషాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకపోతే.. ఆ తర్వాత దాని ప్రభావం మరొకరిపై పడే అవకాశమే లేదని ఈ పరిశోధనలు తేల్చిచెబుతున్నాయి. కరోనా సోకిన వారి నుంచి మరొకరికి వైరస్ సంక్రమించాలంటే ఆ ఐదు నిమిషాలు మాత్రమే కీలకంగా మారింది. ఐతే ఈ పరిశోధనలలో తేలిన విషయాలు నిజమే అయినప్పటికీ.. మరింతగా ఈ వైరస్ సంక్రమణపై పరిశోధనలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

దక్షిణాప్రికాలోనూ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై జరిపిన పరిశోధనల్లో కొన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఒమిక్రాన్ సోకిన వారిలో 80 శాతం మందికి అసలు ఎటువంటి లక్షణాలు ఉండటం లేదని, అసలు కరోనా సోకిన విషయం కూడా వారికి తెలియడం లేదని పరిశోధనలో తేలింది. వీరంతా కేవలం వైరస్ వ్యాప్తికి వాహకాలుగా మాత్రమే పని చేస్తున్నారని అధ్యయనంలో పేర్కొంది. కరోనా పరిశోధనల్లో ఎన్నో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నప్పటికీ, భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం మాత్రం మరిచిపోవద్దని పరిశోధకులు చెబుతున్నారు. కేవలం ఈ విషయాలు పాటించినప్పుడే కరోనా సంక్రమణ పూర్తిగా నిలిచిపోతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: