క్రమశిక్షణ చర్యలు.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రసంగంలో.. ఇది చివరిలో వినిపించినా ఇదే హైలెట్ అయింది. ట్రెజరీ ఉద్యోగులు మెడపై కత్తి పెట్టలేరని, సహాయ నిరాకరణ అంటూ వారు పనిచేయకపోతే సమ్మె నోటీసుకి అర్థం లేదని స్పష్టం చేశారు సజ్జల. అంటే సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత.. ఆ నోటీస్ పీరియడ్ లో కచ్చితంగా ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడు సహాయ నిరాకరణ, పెన్ డౌన్, డౌన్ డౌన్ అనేవి కుదరవు. మరి సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత కొత్త పీఆర్సీ ప్రకారం బిల్లులు పెట్టలేమంటూ ట్రెజరీ ఉద్యోగులు చెప్పడం సరికాదనేది సజ్జల వాదన.

ఉద్యోగ సంఘాలతో చర్చలకోసం నిన్న ఒకరోజంతా సజ్జల టీమ్ వెయిట్ చేసింది. కానీ ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం నేరుగా జీఏడీని కలసి సమ్మె నోటీసు ఇచ్చారు. ఇక్కడ మంత్రులు, సలహాదారు వారికోసం వేచి చూస్తే, వారు మాత్రం తమ కార్యాచరణ తమదేనన్నారు. ఈ దశలో రెండో రోజు కూడా వారి కోసం వేచి చూస్తమని చెబుతూనే సజ్జల సైలెంట్ వార్నింగ్ ఇచ్చారు. క్రమశిక్షణ అనే పదాన్ని వాడేశారు. అంటే ప్రభుత్వం కూడా కఠినంగానే ఉంటుందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. అయితే పరిస్థితి అంతదూరం రాకుండా ఉంటే బాగుంటుందని కూడా అన్నారు సజ్జల.

ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల పీఆర్సీ డిమాండ్లకు తలొగ్గేలా లేదనే విషయం స్పష్టమైంది. అటు కోర్టులో న్యాయపోరాటం జరుగుతోంది, ఇటు ఉద్యోగులు బయట ధర్నాలు, నిరసనలు అంటూ రోడ్డెక్కుతున్నారు. ఈ దశలో ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందని కొంతమంది అంటున్నా.. తగ్గితే తర్వాత వచ్చే ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకునే శక్తి ప్రభుత్వానికి ఉందా అనేది కూడా అనుమానమే.

ఉద్యోగుల లాజిక్ కి సమాధానమేదీ..?
కొత్త పీఆర్సీతో జీతాలు పెరుగుతాయనేది ప్రభుత్వం వాదన, కాదు తగ్గుతాయి అనేది ఉద్యోగుల ఆరోపణ. మరి పాత జీతాలే ఇవ్వండి అంటూ ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్న డిమాండ్ ని ప్రభుత్వం పట్టించుకుంటుందా..? మాకు జీతాలు పెంచి ఇవ్వాల్సిన అవసరం లేదు, పాత జీతాలతోనే సరిపెట్టుకుంటాం అంటుంటే ప్రభుత్వం ఎందుకు వారిని అర్థం చేసుకోవడంలేదు. అంటే పాత జీతాలే ఎక్కువా, కొత్త జీతాలే తక్కువా..? దీనిపై ఎవ్వరూ పూర్తిగా క్లారిటీ ఇవ్వడంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: