సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాజ్యాంగ బద్ద పదవిలో ఉంటూ రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారని.. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న ప్రధానిని అవమానించారని.. కనీసం రాజ్యాంగ విలువలు పట్టించుకోకుండా జుగుప్సాకరంగా మాట్లాడారని కిషన్ రెడ్డి విమర్శించారు. ఏ రాజ్యాంగం ఆధారంగా తెలంగాణ ఏర్పడిందో, ఎలా పార్టీ పెట్టారో, ఎలా రెండు సార్లు గెలిచారో, అలాంటి రాజ్యాంగం రూపొందించిన అంబెడ్కర్‌ను అవమానించేలా ముఖ్యమంత్రి మాట్లాడటం దురదృష్టకరమని కిషన్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ నలుగురిని ఆకట్టుకునేలా మాట్లాడినంత మాత్రాన అబద్దాలు నిజం కావని కిషన్ రెడ్డి అన్నారు. రెండున్నరగంటల పాటు ఏకపాత్రభినయం చేస్తూ కేసీఆర్ మాట్లాడిన మాటలు సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. హుజురాబాద్ ఎన్నికల తరువాత కేసీఆర్, కేసీఆర్ కుటుంబంలో అభద్రత కనిపిస్తోందని.. తనకు నచ్చనిది సమాజంలో ఎవరికీ నచ్చకూడదని కేసీఆర్ భావిస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.
బీజేపీని కేంద్రాన్ని విమర్శించే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంతవరకు పూర్తి చేశారో చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ గురించి కేసీఆర్ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారన్న కిషన్ రెడ్డి.. గతేడాది 79,529 కోట్లు సబ్సిడీకి కేటాయింపులు ఉంటే ఈ సంవత్సరం 33 శాతం యూరియా సబ్సిడీ నిధులు పెంచామని గుర్తు చేశారు. గత బడ్జెట్ లో 79,529 కోట్ల సబ్సిడీ ఉన్నా తదుపరి 1,40,000 కోట్లకు ఎరువుల సబ్సిడీ పెంచామని అన్నారు. యూరియా, ఆమోనియా, పోటాష్ ధరలు పెరిగినా రైతులపై భారం వేయలేదని.. కానీ కేసీఆర్ మాత్రం సరైన సమాచారం లేకుండా ఇష్టానుసారం మాట్లాడారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి