నాటో దేశాల జోలికి రష్యా వెళితే.. అమెరికా తప్పక జోక్యం చేసుకుంటుందని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ స్పష్టం చేశారు. పుతిన్ తో చర్చలు జరిపే యోచన లేదని తెలిపారు. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో బైడెన్ మాట్లాడారు. బాధల్లో ఉన్న ఉక్రెయిన్ ప్రజలకు చేయూతనందిస్తామని జెలెన్ స్కీకి భరోసా ఇచ్చారు.
 
ఇక రష్యా దాడులతో తీవ్రంగా నష్టపోతున్న ఉక్రెయిన్ లో మానవతా చర్యలకు గాను ఐక్యరాజ్య సమితి 20మిలియన్ డాలర్ల తక్షణ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్ కు అమెరికా కూడా 600 మిలియన్ డాలర్ల భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. ఇందులో తక్షణ సైనిక సాయం కింద 250 మిలియన్ డాలర్లను కేటాయించింది. ఇతర అవసరాల కోసం 350మిలియన్ డాలర్లు వినియోగించనున్నారు. ఈ బిల్లుపై యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ సంతకం చేశారు.

ఇక ఉక్రెయిన్ లోని ఖార్కీవ్ నగరంలో గడ్డకట్టే చలితో పాటు బాంబుల మోత ప్రజలను వణికిస్తోంది. గురువారం ఉష్ణోగ్రత మైనస్ 2డిగ్రీలు ఉండగా.. శుక్రవారం ఒక్కసారిగా మైనస్ 6డిగ్రీలకు పడిపోయింది. ఒకవైపు దట్టమైన మంచు కురుస్తుంటే మరోవైపు మిసైల్ దాడులతో నగరం అగ్నిగుండంగా మారింది. కళ్లముందు పేలుతున్న బాంబులను చూస్తూ.. ఎముకలు కొరికే చలిలో వణుకుతూ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు.

ఇక రష్యా బలగాలు ఉక్రెయిన్ నగరాలను వేగంగా ఆక్రమించుకుంటున్నాయి. తాజాగా రాజధాని కీవ్ పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. అడ్డొచ్చిన ఉక్రెయిన్ సేనలను నిలువరించి ముందుకు సాగుతున్నాయి. దీంతో దాదాపు కీవ్ నగరం రష్యా హస్తగతమైనట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం తాను కీవ్ లోనే ఉన్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు.

అటు రష్యా దాడుల నుంచి తప్పించుకునేందుకు ఉక్రెయిన్ పౌరులు అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లు, బంకర్లలో తలదాచుకుంటున్నారు. కీవ్ లో బాంబుల మోత మధ్య ఓ గర్భిణి ప్రసవించింది. ఆడబిడ్డకు జన్మినిచ్చింది. యుద్ధం సమయంలో పుట్టిన ఆ పాప శాంతిని తీసుకురావాలని అక్కడి వారు ఆకాంక్షిస్తున్నారు. హోప్ అనే పేరు పెట్టాలని భావిస్తున్నారు. సుమారు 50లక్షల మంది ప్రజలు పక్క దేశాలకు తరలిపోయారని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది.









మరింత సమాచారం తెలుసుకోండి: