ఏపీలో టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలుసు. ఈ కేసులో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్, బెయిల్ పై విడుదల చకచకా జరిగిపోయాయి. దీంతో ఈ కేసులో రాజకీయ కోణం కూడా ఉందనే వార్తలు మొదలయ్యాయి. అయితే తాజాగా నారాయణ ఇద్దరు కుమార్తెలు, శరణి, సింధూర, నారాయణ అల్లుడు పునీత్.. సహా మరో 10మంది హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

టెన్త్ పేపర్ లీకేజీ కేసులో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని..  హౌస్‌ మోషన్‌ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలంటూ వారు వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఆదివారం ఈ పిటిషన్లపై న్యాయమూర్తి అత్యవసర విచారణ జరిపారు. పిటిషనర్లపై ఈనెల 18వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.  ఈ కేసులో పూర్తి స్థాయి విచారణను కూడా ఈనెల 18కి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.

టెన్త్‌ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో చిత్తూరు జిల్లా డీఈవో ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు నమోదైంది. చిత్తూరు వన్‌ టౌన్‌ పోలీసులు ఈ కేసు విచారణ చేపట్టారు. ఈ కేసులో భాగంగానే ఈ నెల 10న పోలీసులు మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేశారు. ఆయనను హైదరాబాద్ నుంచి చిత్తూరుకి తరలించారు. అయితే 2014లోనే ఆ విద్యాసంస్థల చైర్మన్‌ పదవికి నారాయణ రాజీనామా చేశారని, దానికి తగ్గ సాక్ష్యాలను వారు మేజిస్ట్రేట్ కి చూపించారు. దీంతో మేజిస్ట్రేట్ నారాయణకు బెయిలిచ్చారు. అయితే ఈ వ్యవహారంలో తదుపరి అరెస్ట్ లు కూడా ఉంటాయనే అనుమానం మొదలైంది.

ఈ కేసులో పోలీసులు తమను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని, ముందస్తు బెయిల్‌ ఇప్పించాలని కోరుతూ పొంగూరు శరణి, పొంగూరు సింధూర, నారాయణ అల్లుడు పునీత్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు నమోదు చేసిన కేసులో నారాయణ కుమార్తెలు, అల్లుడు, ఇతర 10మంది సిబ్బంది నిందితులు కాదని, కోర్టు దృష్టికి తీసుకొచ్చారు న్యాయవాది. కానీ వారంతా నారాయణ విద్యాసంస్థల్లో వివిధ హోదాల్లో ఉన్నందున పోలీసులు వారిని అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్పారు. దీంతో న్యాయమూర్తి వారికి రక్షణ కల్పిస్తూ.. ఈనెల 18వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: