ఇద్ద‌రూ నిన్న మొన్న‌టి వ‌ర‌కు  టీడీపీ నాయ‌కులే. చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితంగా ప‌నిచేసిన వారే. కానీ, త‌ర్వాత‌.. ఒక‌రు బీజేపీలోకి వెళ్లారు. మ‌రొక‌రు వైసీపీ బాట‌పట్టారు. వారే ప్ర‌స్తుతం బీజేపీ నేత‌గా ఉన్న సుజ‌నా చౌద‌రి(స‌త్య‌నారాయ‌ణ), మ‌రొక‌రు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా ఈ ఇద్ద‌రి మ‌ధ్య పెద్ద‌గా ఎలాంటి విభేదాలు లేవు. కానీ, ఇప్పుడు కేశినేని కెలికేశారు. అది కూడా సుజ‌నాపై పేరు ఎత్తుకుండానే ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీతో పొత్తులో భాగంగా సుజ‌నాకు విజ‌య‌వాడ ఎంపీ టికెట్ ఇవ్వాల‌ని అనుకున్నారు.

కానీ, నానిని ఓడించాల‌నే ల‌క్ష్యంతో కేశినేని చిన్నికి అవ‌కాశం ఇచ్చారు. అయినా.. సుజ‌నాను వ‌దులుకునేందుకు ఇష్టం లేక‌.. ఆయ‌న‌కు విజ‌య‌వాడ ప‌శ్చిమ సీటును కేటాయించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. అయితే..ఇంత‌లోనే సుజ‌నాపై కేశినేని నాని తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ.. ప‌శ్చిమ‌లో చిచ్చు పెట్టే ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంపై ఎన్డీయే కూటమి కుట్రలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ నియోజకవర్గాన్ని జనసేనకు ఇచ్చాం, బీసీలకు ఇచ్చాం అని మొన్నటి దాకా టీడీపీ చెప్పిందని అన్నారు.

కానీ, ఈ నియోజకవర్గ టికెట్ ను బీసీ అభ్యర్థికి కాకుండా బీజేపీ తరపున ధనికుడైన ఓ బిజినెస్ మెన్ కు ఇవ్వబోతున్నారని... ఆయన వ్యవస్థలను మేనేజ్ చేసే వ్యక్తి అని పరోక్షంగా సుజనా చౌదరి గురించి వ్యాఖ్యానించారు. ఛార్టెర్డ్ ఫ్లయిట్స్ లో తిరిగే ఆ వ్యాపారవేత్త గల్లీ నుంచి ఢిల్లీ వరకు వ్యవస్థలను మేనేజ్ చేయగలరని చెప్పారు. పేదలు ఉన్న నియోజకవర్గంలో ధనికులకు టికెట్ ఇస్తున్నారని కేశినేని నాని దుయ్యబట్టారు. తమ అధినేత సీఎం జగన్ చెపుతున్నట్టు ఈ ఎన్నికలు పేదలకు, పెత్తందారు లకు మధ్య జరుగుతున్నాయని అన్నారు.

గెలిచే సత్తా లేక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెరతీస్తున్నారని విమర్శించారు. విజయవాడ వెస్ట్ సీటు ఎప్పటికీ బీసీలు, మైనార్టీలదేనని... గతంలో తన కూతురు విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తానంటే వద్దని తాను బహిరంగంగా చెప్పానని తెలిపారు. అంటే.. మొత్తంగా త‌న కుమార్తె కు టికెట్ రాలేద‌ని.. ఇప్పుడు ఎవ‌రూ పోటీ చేయ‌కూడ‌ద‌నా?  నాని చెబు తున్న గీతోప‌దేశం? అని టీడీపీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. ఏదేమైనా.. అంతో ఇంతో ప్ర‌భావం చూపించే నాని వ్య‌వ‌హారం.. ఇప్పుడు ప‌శ్చిమ సీటులో చిచ్చు పెట్టేదిగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: