ఏపీలో ఎన్నికల ప్రచారం రోజురోజుకూ ఎండలతో పాటు పెరుగుతూ వస్తోంది.  భానుడి భగభగలు రాజకీయ  నాయకులు హాట్ కామెంట్లతో ఏపీ ప్రజలు అట్టుడికి పోతున్నారు. విజయవాడలో జగన్ మీద రాయి దాడితో ప్రచారంలో మాటల వేడి తారా స్థాయికి చేరింది. ఇప్పుడే ఇలా ఉంటే.. నామినేషన్ల పర్వం మొదలయ్యాక ప్రచార సరళి ఎలా ఉండబోతుందో అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.


మరోవైపు ఎన్నికల నియమావళి దాటకుండా ప్రచారం నిర్వహించాలని పలువురి నేతలకు ఈసీ నోటీసులు జారీ చేసినా నేతల మాటల్లో వేడి తగ్గడం లేదు. బస్సు యాత్రలో భాగంగా భీమవరంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విపక్ష నేతలపై హాట్ కామెంట్లు చేశారు. ఇప్పటి వరకు చంద్రబాబునే లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగారు.  అయితే ఇప్పుడు సీఎం.. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.


ప్రస్తుతం అక్కడ జనసేన ప్రభావం ఎక్కువగా ఉందనే టాక్ నడుస్తోంది. దీంతో జగన్ తన శైలిని మార్చేశారు. పవన్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. జనసేనాని పేరు చెప్పడానికి ఇష్టపడని జగన్.. ఒక దత్తపుత్రుడు అంటూ మొదలు పెట్టారు. నాలుగేళ్లకు కార్లను మార్చినట్లు.. భార్యలను మారుస్తాడంటూ.. పెళ్లికి ముందు ప్రమాణాలు చేసి.. పిల్లలు పుట్టాక వారిని వదిలేస్తారని ఎద్దేవా చేశారు.


భార్యలను మార్చినట్లు ఇప్పుడు నియోజకవర్గాలను కూడా మారుస్తున్నాడంటూ.. గతంలో భీమవరం నుంచి పవన్ పోటీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ మధ్య ఆయనలో బీపీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. పునకాలు వచ్చినట్లు ఊగిపోతున్నారు. పవిత్రమైన వివాహ సంబంధాలను రోడ్డుపైకి తీసుకొచ్చారు. నిన్ను చూసి మిగతా వాళ్లు కూడా వాళ్ల భార్యలను మార్చడం మొదలు పెడితే అక్కా చెళ్లెమ్మల పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే సీఎం జగన్  మళ్లీ పవన్ ని కెలకడం మొదలు పెట్టారేమో అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: