గన్నవరం నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని టీడీపీ భావిస్తోంది. అక్కడి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రస్తుతం పార్టీలు మారి మరోసారి బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆయన బరిలోకి దిగారు. అయితే ఆయనపై టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ పోటీ చేసి గెలిచారు. ఎన్నికల తర్వాత పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ తర్వాత ప్లేటు ఫిరాయించారు. వైసీపీలో చేరిపోయారు. అయితే ఆయనపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు దీనిని జీర్ణించుకోలేకపోయారు. ఇక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వైసీపీ టికెట్ వల్లభనేనికి కేటాయించనున్నట్లు పార్టీ నుంచి సంకేతాలు అందాయి. దీంతో ఆయన టీడీపీలో చేరిపోయారు. టీడీపీ ఆయనకు బీఫారం సైతం ఇచ్చింది. దీంతో రాజకీయంగా తనకు పునర్జన్మ లభించినట్లు యార్లగడ్డ భావించారు. ఎలాగైనా ఇక్కడి నుంచి గెలిచి, తన గెలుపును చంద్రబాబుకు గిఫ్టుగా ఇస్తానని ఆయన శపథం చేశారు. తన నామినేషన్‌ను ఇప్పటికే సమర్పించిన ఆయన ఇక గెలుపుపై దృష్టిసారించారు. నియోజకవర్గం మొత్తం తన ప్రచారాన్ని మొదలు పెట్టేశారు.

తొలి నుంచి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉంది. క్యాడర్ కూడా సరైన నాయకుడి కోసం ఇన్నాళ్లుగా ఎదురు చూసింది. యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరడం, వంశీపై గెలవాలని ఆయన కృతనిశ్చయంతో ఉండడంతో ఆయనకు పార్టీ టికెట్ కేటాయించింది. ఇక్కడ టీడీపీ నుంచి గెలిచిన వంశీ తమ పార్టీ అధినేత చంద్రబాబుపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ఆ విమర్శలు పరిధి దాటాయని టీడీపీ భావిస్తోంది. లోకేష్ తల్లి, చంద్రబాబు భార్య భువనేశ్వరిని అవమానించేలా వంశీ వ్యాఖ్యలు చేశారని టీడీపీ ఆగ్రహంగా ఉంది. దీంతోపాటు నియోజకవర్గంలో టీడీపీ ఆఫీసును తగులబెట్టడం వంటివి ఆ పార్టీలో మరింత ఆగ్రహాన్ని పెంచేలా చేశాయి. ఇప్పటికే అక్కడ పార్టీ బలంగా ఉండడం, దీనికి తోడు బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా పోటీ చేస్తుండడం ఆ పార్టీకి లాభించనుంది. ఖచ్చితంగా అక్కడ గెలుస్తామని, విర్రవీగిన వంశీని ఓడించి బుద్ధి చెప్పాలని టీడీపీ భావిస్తోంది. ఇక ప్రచారంలో మీడియాతో యార్లగడ్డ మాట్లాడుతూ, కార్యకర్తల మద్దతుతో గన్నవరంలో కూటమి అభ్యర్థిగా విజయం సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. గన్నవరంలో మెజారిటీ వైసీపీ శ్రేణులు, నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే తటస్థులు కూడా తనకు ఓట్లు వేసి గెలిపిస్తారన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: