
ప్రపంచ తయారీ హబ్‌గా మారాలన్న భారత ఆశయాలను దెబ్బతీయడమే లక్ష్యంగా చైనా ఈ అనధికారిక వాణిజ్య ఆంక్షలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్ల తయారీకి అవసరమైన కీలక పరికరాలు, కొన్ని రకాల ముడి ఖనిజాలపై నియంత్రణలు విధిస్తూ, తన దేశ నిపుణులను భారత్ నుంచి వెనక్కి వచ్చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తోంది. ఈ చర్యలు భారత్ సరఫరా గొలుసును అస్థిరపరిచే ఉద్దేశంతోనే జరుగుతున్నాయని ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది.
చైనా చేపడుతున్న ఈ రహస్య చర్యల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 32 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.75 లక్షల కోట్లు) విలువైన స్మార్ట్‌ఫోన్ల ఎగుమతి లక్ష్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ICEA హెచ్చరించింది. యాపిల్, గూగుల్, మోటరోలా, ఫాక్స్‌కాన్, వివో, ఒప్పో, లావా, డిక్సన్, ఫ్లెక్స్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి దిగ్గజ కంపెనీలు సభ్యులుగా ఉన్న ICEA, ఈ పరిస్థితిపై తక్షణం జోక్యం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.
ఈ కుట్రలో భాగంగా, యాపిల్ ఐఫోన్లను తయారుచేసే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఫాక్స్‌కాన్‌పై చైనా ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. భారత్‌లోని ఫాక్స్‌కాన్ ప్లాంట్లలో పనిచేస్తున్న 300 మందికి పైగా చైనా ఇంజినీర్లు, టెక్నీషియన్లను వెనక్కి పిలిపించుకున్నట్లు బ్లూమ్‌బెర్గ్ కథనాలు వెల్లడించాయి. యాపిల్ సంస్థ ఐఫోన్ 17 తయారీని భారత్‌లో ప్రారంభించడానికి సిద్ధమవుతున్న కీలక తరుణంలో నిపుణుల కొరత సృష్టించి, ఉత్పత్తి ప్రక్రియను నెమ్మదింపజేయాలన్నది చైనా వ్యూహంగా కనిపిస్తోంది. ఈ చర్యలు టెక్నాలజీ బదిలీని, ఉత్పత్తి సామర్థ్యం పెంపును నేరుగా దెబ్బతీస్తాయి.
ప్రభుత్వం ఈ అనధికారిక ఆంక్షలను తీవ్రంగా పరిగణించి, ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను అన్వేషించడం, దేశీయంగా కీలక పరికరాలు, నిపుణుల నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా చైనా ఎత్తుగడలను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.