తెలంగాణ రాజకీయాలు మరోసారి తలకిందులవుతున్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ సీయం రమేష్ చేసిన సంచలన ఆరోపణలతో రాజకీయ వర్గాల్లో పెను చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బీజేపీలో పార్టీని విలీనం చేసేందుకు ప్రయత్నించారని, అది తన ఇంట్లోనే జరిగిందని, దీనికి సంబంధించిన వీడియో రికార్డింగ్ కూడా తన వద్ద ఉందని సీయం రమేష్ బాంబు పేల్చారు! శనివారం మీడియాతో మాట్లాడిన సీయం రమేష్, "కొన్ని నెలల క్రితం కేటీఆర్ నా ఇంటికి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో ఉన్న అవినీతి కేసులు మర్చిపోవాలన్నారు. దీనికి సంబంధించిన వీడియో రికార్డింగ్ కూడా నా వద్ద ఉంది. అప్పట్లో ఇది ప్రైవేట్ చర్చగా చూసి బయటపెట్టలేదు. కానీ ఇప్పుడు కేటీఆర్ చేస్తున్న ఆరోపణలకి సమాధానంగా నిజం చెప్పాల్సిన అవసరం వచ్చింది" అంటూ బాంబ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.


అంతేకాకుండా, "కేటీఆర్ నిజంగా నా ఇంటికి రాలేదని మీరు అంటారా? అయితే దేవుడి మీద ప్రమాణం చేయండి" అంటూ కేటీఆర్‌కు బహిరంగ సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ ఉష్ణోగ్రతలు మరింత పెంచేశాయి. సీయం రమేష్ వాదనల ప్రకారం, బీఆర్ఎస్ నేతలు బీజేపీ వద్దకు సౌకర్యాల కోసం వచ్చిన చరిత్రను ఈ వీడియోలు బహిరంగం చేయనున్నాయన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం కేటీఆర్ ఆరోపణలకు కౌంటర్‌గానే కాకుండా, పూర్తిగా బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తుపై దెబ్బ కావొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కేటీఆర్ చేసిన ఆరోపణలు కూడా ఇందుకు బీజం వేసినట్టు ఉన్నాయి. ముఖ్యంగా "1600 కోట్ల ఫోర్త్ సిటీ రోడ్ కాంట్రాక్ట్‌ను బీజేపీ ఎంపీ సీయం రమేష్‌కి అప్పగించారన్న ఆరోపణ" ఇప్పుడు తిరిగి ఆయనేపై బుమరాంగ్ అవుతున్నట్టుంది.



ఈ వ్యవహారంలో ముఖ్యమైన అంశం – సీయం రమేష్ పేర్కొన్న వీడియోను ఎప్పుడు బయట పెడతారు? అసలు ఆ వీడియోలో ఉన్నది ఎంత వరకు నిజం? నిజంగానే అది చట్టపరంగా బలమైన ఆధారమా? అన్న ప్రశ్నలతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ తతంగం తీవ్రమవుతుండగా.. ఇప్పుడు ఈ వీడియో రాజకీయాలు అసలు రాజకీయ చక్రాన్ని బిగించబోతున్నాయని స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ దుమారానికి ముగింపు ఎక్కడంటే... కేటీఆర్ ఎలా స్పందిస్తారో, సీయం రమేష్ వీడియో ఎప్పుడు బయటపెడతారో అనే రెండు ప్రశ్నలే ఫోకస్‌లోకి వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: