ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎమ్మెల్యేల అజాగ్రత్త వ్యవహారాలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన చేసిన ఆరుగురు ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. కేబినెట్ సమావేశంలోనే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. “ఎవరు పార్టీ లైన్ దాటినా, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినా సహించేది లేదు. అవసరమైతే వదులుకోవడానికి కూడా సిద్ధమే” అని స్పష్టంచేశారు. ఇందుకు కారణం ఇటీవల శ్రీశైలంలో జరిగిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఘటన. అక్కడ ఆయన మద్యం మత్తులో ఉండి అటవీ అధికారులపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ఇప్పటికే కేసు నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.


అంతేకాదు, అటవీ శాఖ తన ఆధ్వర్యంలో ఉండటంతో పవన్ కల్యాణ్ కూడా ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. “నేరం చేసిన వారిని ఎవరైనా వదలబోము” అని పవన్ స్పష్టం చేశారు. దీంతో బుడ్డా రాజశేఖర్ రెడ్డితో పాటు మరో జనసేన నేతపైనా కేసు నమోదైంది. ఇక గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవి కూడా వేర్వేరు వివాదాల్లో చిక్కుకున్నారు. అంతేకాదు, నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు కూడా బయటికొచ్చాయి. వారు ఒక రౌడీషీటర్ కు పెరోల్ ఇప్పించేందుకు సిఫారసు చేసినట్లు సమాచారం. మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలపై ఈ విధంగా సీరియస్ ఆరోపణలు రావడంతో చంద్రబాబు ఒక్కసారిగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని మూడ్లోకి వెళ్లిపోయారు.


పార్టీ లోపల అసమ్మతి, నిర్లక్ష్యం ఎక్కువైతే ప్రజల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయని చంద్రబాబు బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేశారు. “ఇకపై తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు. పెద్దవాళ్లు, చిన్నవాళ్లు అనే తేడా ఉండదు” అని తేల్చేశారు. ఈ హెచ్చరికతో వివాదాల్లో ఉన్న ఎమ్మెల్యేలు భయపడుతున్నప్పటికీ, రాజకీయ వర్గాల్లో మాత్రం మరో చర్చ మొదలైంది. “హెచ్చరికలతోనే సరి పెడితే ఎవరూ పట్టించుకోరు. కఠిన చర్యలు తీసుకుంటేనే క్రమశిక్షణ వస్తుంది” అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు, ఈ ఆరుగురి ఇష్యూ ఇప్పుడు టిడిపిజనసేన కూటమికి ఇమేజ్ టెస్ట్గా మారింది. పవన్ – చంద్రబాబు ఇద్దరూ క్రమశిక్షణ విషయంలో ఒకే దారిలో నడుస్తారా? లేక రాజకీయ లెక్కలు చూసి ఆగిపోతారా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: