
అయితే ఇప్పుడు తాజా పరిణామాల్లో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జైలు పాలయ్యారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన మద్యం అక్రమాలు, డబ్బు లావాదేవీల వ్యవహారంలో ఆయన పాత్ర ఉందని సిట్ అధికారులు పేర్కొన్నారు. అందువల్ల ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలులో పెట్టి దాదాపు రెండు వారాలు గడిచిపోయింది. ఈలోపు పార్లమెంటు సమావేశాలు ముగిశాయి. ఇక వచ్చే నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉండగా, ప్రతి ఓటు కీలకమని భావిస్తున్న పరిస్థితుల్లో మిథున్ రెడ్డికి బెయిల్ తీసుకురావాలని వైసీపీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. జైల్లో ఉన్న మిథున్ రెడ్డి తనను పరామర్శించేందుకు వస్తున్న వారితో ఎక్కువగా జగన్ గురించే అడుగుతున్నారని సమాచారం. “జగనన్న ఏమన్నాడు? ఎప్పుడు వస్తారు?” అంటూ పదేపదే ప్రశ్నిస్తున్నట్టు చెబుతున్నారు.
కానీ ఇప్పటివరకు జగన్ ఈ దిశగా ఎలాంటి అడుగు వేయలేదని, పరామర్శించాలా వద్దా అన్న దానిపై కూడా చర్చ జరగలేదని సమాచారం. దీనికి ప్రధాన కారణం కూడా ఉంది. ఇప్పటివరకు జగన్ పరామర్శించిన వారు వ్యక్తిగత కేసుల్లో ఇరుక్కుపోయినవారే. కానీ లిక్కర్ కుంభకోణంపై దాఖలైన చార్జిషీట్లలో జగన్ పేరు కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆయన జైలు వెళ్లి మిథున్ రెడ్డిని కలిస్తే కేసు మరింత క్లిష్టతరం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే కారణంగా ఇప్పటివరకు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. ఇక ముందు ముందు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో, మిథున్ రెడ్డిని కలిసే అవకాశముందో లేదో చూడాలి.