ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ తన మంత్రిత్వ శాఖలపై పూర్తి దృష్టి పెట్టారు. ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్నందున ఆ బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఇప్పుడు పార్టీ పరంగా కూడా జనసేనను బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని, విశాఖపట్నం వేదికగా “సేనతో సేనాని” కార్యక్రమం ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ వ్యవహారాలపై పూర్తి సమీక్ష కొనసాగుతోంది. వన్ టూ వన్ సమావేశాలు .. పవన్ కళ్యాణ్ తొలి రోజునే తన పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలతో విడివిడిగా వన్ టూ వన్ సమావేశాలు నిర్వహించారు.


 ప్రతి నియోజకవర్గ పరిస్థితులు, అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, ఎన్నికల హామీలు – ఇవన్నింటి గురించి పవన్ నేరుగా ఎమ్మెల్యేలతో చర్చించారు. ఒక్కో ఎమ్మెల్యేతో ఐదు నుంచి పది నిమిషాల పాటు సమావేశమై, వారి పనితీరు, ప్రజలలో ఉన్న ఇమేజ్ గురించి తెలుసుకున్నారని సమాచారం. సర్వే రిపోర్ట్ ఆధారంగా సమీక్ష .. ఈ సమావేశాలు కేవలం చర్చలకే పరిమితం కాలేదు. పవన్ దగ్గర ప్రత్యేకంగా సిద్ధం చేసిన సర్వే రిపోర్టులు కూడా ఉన్నాయి. ఆయా నియోజకవర్గాలలో ప్రజలు ఎమ్మెల్యేల గురించి ఏమనుకుంటున్నారు? ఎంతవరకు వారు ప్రజలతో మమేకమవుతున్నారు? పార్టీని బలోపేతం చేసేందుకు ఎంత శ్రద్ధ చూపుతున్నారు? అనే విషయాలను సర్వేలో స్పష్టంగా లిఖించారు. ఆ రిపోర్టుల ఆధారంగానే పవన్ ఒక్కో ఎమ్మెల్యే పనితీరును రివ్యూ చేశారు.



ఆరోపణలపై వివరణలు .. కొంతమంది ఎమ్మెల్యేలపై మీడియాలో వస్తున్న ఆరోపణలపై కూడా పవన్ ఈ సమీక్షలో వివరణ కోరినట్లు చెబుతున్నారు. అంటే కేవలం పాజిటివ్ విషయాలే కాదు, నెగటివ్ రిపోర్ట్స్ కూడా ఆయన ద‌గ్గ‌ర ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యేలందరిలోనూ ఒక రకమైన ఉత్కంఠ నెలకొంది.ర్యాంకులు ఎవరికీ? .. ఇక ముఖ్యంగా పవన్ ఈ సారి ఎమ్మెల్యేల పనితీరుకు ర్యాంకులు ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఎవరికి “బెస్ట్”, ఎవరికి “సూపర్ బెస్ట్”, ఎవరికి “బెట్టర్ కావాలి” అనే లెవెల్లో ర్యాంకులు ఇస్తారని అంటున్నారు. అయితే ఈ ర్యాంకులు సీక్రెట్‌గా ఒక్కో ఎమ్మెల్యేకే చెబుతారా లేక అందరి ముందే ప్రకటిస్తారా అన్నది క్లారిటీ లేదు. కానీ ఒకసారి ఈ ర్యాంకులు బహిరంగం చేస్తే, పార్టీ లోపలే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ పెద్ద చర్చ మొదలవడం ఖాయం.



మూడు రోజుల విశాఖ బస .. మొత్తం మూడు రోజులు విశాఖలో ఉండే పవన్ కళ్యాణ్, పార్టీ బలోపేతం, ఎమ్మెల్యేల పనితీరు, భవిష్యత్ వ్యూహాలపై క్లియర్ ప్లాన్ చేసుకోనున్నట్లు సమాచారం. ఈ సమీక్ష తర్వాత ఎవరి స్థానం ఎక్కడ అన్నది స్పష్టమవుతుందని, అలాగే జనసేన లో భవిష్యత్తులో ఎవరు స్టార్ లీడర్స్‌గా ఎదుగుతారో కూడా తేలనుందని అంటున్నారు. మొత్తానికి, విశాఖ వేదికగా పవన్ చేసే ఈ ర్యాంక్ గేమ్ జనసేన ఎమ్మెల్యేల మధ్యలో పోటీ, ఉత్సాహం, ఉత్కంఠ అన్నీ పెంచేసింది. మరి ఎవరికి పాజిటివ్ రిపోర్ట్.. ఎవరికి నెగటివ్ ర్యాంక్ అన్నది బయటకొస్తే, రాజకీయ సర్కిల్ మొత్తంలో పెద్ద చర్చ జరగడం ఖాయం!

మరింత సమాచారం తెలుసుకోండి: