వైసీపీ సీనియర్ నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. అవినీతి, అక్రమాలు, వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ ఆమెపై దూష‌ణ పూరితంగా చేసిన కామెంట్లు, బాడీ షేమింగ్ వ‌ర‌కు వెళ్లిపోయార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ ప‌రిణామం ఇటు పార్టీలోనూ, అటు ప్ర‌భుత్వ వ‌ర్గాల్లోనూ తీవ్ర చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌య్యాయి. శ్రీలక్ష్మి పేరు తెలుగు రాజకీయాల్లో కొత్త కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆమె గనుల శాఖ డైరెక్టర్‌గా పనిచేసినప్పుడు, కర్ణాటకకు చెందిన గాలి జనార్దన్ రెడ్డి అనుబంధం ఉన్న ఓబులాపురం గనులకు అనుమతులు ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ.


ఈ కేసులో సీబీఐ, ఈడీ విచారణలు కూడా జరిగాయి. అయినా ఆమెను వైసీపీ ప్రభుత్వంలో తిరిగి కీలక స్థానంలో నియమించారు. పురపాలక శాఖ వంటి ప్రాధాన్యమైన బాధ్యతలు అప్పగించడం ద్వారా వైఎస్ కుటుంబంతో ఆమెకున్న అనుబంధం మరింత బలపడింది. ఇలాంటి అధికారి పై భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సహజంగానే పెద్ద సెన్సేషన్ అయ్యాయి. అసలు భూమన ఆగ్రహానికి కారణం టీడీఆర్ బాండ్ల విషయంలో అవినీతి జరిగిందన్న వార్తలు. ఈ సమాచారం శ్రీలక్ష్మి టిడిపి నాయకులకు అందజేశారని ఆయన ఆరోపించారు. అయితే వాస్తవానికి ఎవరు సమాచారం ఇచ్చినా, అవినీతి జరిగి ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే. ఒకవేళ తప్పు చేయకపోతే దాన్ని నిరూపించుకునే అవకాశం ఉంది. అయినా శ్రీల‌క్ష్మిని తీవ్ర‌మైన ప‌ద‌జాలంతో దూషించ‌డం పార్టీకి మైన‌స్ అయ్యింది.


ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి జగన్ సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం. మహిళా ఓటు బ్యాంకును కూటమి ప్రభుత్వం ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న టైంలో పార్టీ తరఫున ఒక సీనియర్ నేత ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించినట్టు తాడేపల్లి వర్గాల టాక్. ముఖ్యంగా తన తండ్రి హయాంలోనూ, తన పాలనలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించిన అధికారిని అవమానించడం సరైంది కాదని జగన్ స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీలో ఈ ఘటనపై తీవ్ర చర్చ సాగుతోంది. భూమనపై పార్టీ అధిష్ఠానం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: