ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, అభివృద్ధి అజెండాలో కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం, వరుసగా 7 సార్లు ఆయన విజయంతోనే కాదు, గత 15 నెలల్లో వచ్చిన మార్పులతో కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. ఎన్నికలకు ముందు వైసీపీ చేసిన విమర్శలు, వ్యూహాలు ఒక్కొక్కటిగా ఫెయిల్ అవుతుంటే, చంద్రబాబు – భువనేశ్వరి జంట ఇక్కడ ప్రజలతో కలసి నడుస్తూ హామీలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా సూర్యఘర్ పథకం కుప్పంలోనే ప్రారంభించి పలు మండలాల్లో అమలు చేయడం ప్రజలకు ఊరటనిచ్చింది. విద్యుత్ చార్జీల భారం తగ్గిపోవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ఇక ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఇంటికో ఉపాధి లక్ష్యంగా పెట్టుకున్నారు. కుట్టుమిషన్లు, కంప్యూటర్లు అందించడంతో చేతివృత్తులు, యువత ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. విద్యలోనూ పాజిటివ్ మార్పులు రావడం ప్రారంభమైంది. తాజాగా కుప్పంలో భారీగా రెండు పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గేమ్‌చేంజర్‌గా మారబోతోంది. 8 వేల కోట్ల పెట్టుబడులు, 5 వేల మందికి పైగా స్థానికులకు ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఇందులో ముఖ్యంగా పండ్ల గుజ్జు పరిశ్రమ ఏర్పాటుతో చిత్తూరులో మామిడి రైతులకు బలమైన మద్దతు లభించనుంది. ఇప్పటి వరకు పండ్ల సమస్యతో రైతులు ఇబ్బంది పడితే, ఇకపై పల్ప్ ఇండస్ట్రీ కారణంగా వారికి స్థిరమైన ఆదాయం వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.



ఇక రోడ్ల నిర్మాణం, నీటి సరఫరా వంటి ప్రాజెక్టులు కుప్పంలోనే స్పీడ్‌గా జరుగుతున్నాయి. దీంతో నియోజకవర్గం రాష్ట్రంలోనే అభివృద్ధి మోడల్గా మారబోతోందని టీడీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. "కుప్పం అంటే కేవలం చంద్రబాబు గెలిచే స్థలం కాదు, ఇప్పుడు ఇది రాష్ట్రానికి నెంబర్ వన్ నియోజకవర్గం అవుతోంది" అనేది స్థానికుల అభిప్రాయం. మొత్తానికి చంద్రబాబు తన స్వీయ నియోజకవర్గాన్ని అభివృద్ధి అజెండాలో టాప్ లెవెల్‌కి తీసుకెళ్లడానికి ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆ వేగం ఇలాగే కొనసాగితే, కుప్పం మాత్రమే కాదు.. మొత్తం రాష్ట్రానికి దారిదీపం అవుతుంది అని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: