అసెంబ్లీకి రాకపోయినా తరచూ ప్రెస్ మీట్లతో పలకరిస్తున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్.. తాజాగా మరోసారి కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రైతులను వారి సమస్యలను పట్టించుకోవడం లేదంటూ జగన్ ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా రైతు భరోసా సాయం అందించాం, మార్కెట్లో కాంపిటీషన్ పెంచి ధరలు పెరిగేలా చేసాం, ప్రతి ఆర్బీకేలో ఈ క్రాపింగ్ చేసాం, మా హయాంలో కిలో ఉల్లి ధర రూ. 40 నుంచి రూ. 120 వరకు ఉండేది, కోవిడ్ సమయంలోనూ రైతులను ఆదుకున్నాం, మరి కూటమి ప్రభుత్వం ఏం చేసింది? అంటూ జగన్ ప్రశ్నించారు.


ప్రస్తుతం రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు లేదని.. ఉల్లి, టమాటో, చీనీ రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు చిత్తశుద్ధి ఏంటో ఉల్లి ధరలతోనే స్పష్టమైందని ఎద్దేవా చేశారు. రెండు నెలలుగా రైతులు ఎరువులు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. ఎరువుల కోసం రైతులు పగలు రాత్రి అనే తేడా లేకుండా క్యూ లైన్ లో నిలబడుతున్నారు.. చివ‌ర‌కు సీఎం సొంత నియోజకవర్గంలోనే ఎరువులు దొర‌క‌డం లేదంటే చంద్రబాబు ఎక్కడైనా దూకి చావాలి అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


మా పాలల్లో రైతులు రోడెక్క‌డం చూసారా.. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది అంటే చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి అంటూ జగన్ హేళన చేశారు. ఆర్బీకేల‌ను, ఈ-క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ప్రభుత్వం నుంచి వెళ్లాల్సిన ఎరువులను టీడీపీ నేతలు దారి మళ్లించి అధిక ధరలకు బ్లాక్ లో అమ్మేసుకుంటున్నారు. యూరియాలో రూ. 250 కోట్ల స్కామ్ జరిగింది. చంద్ర‌బాబు ద‌గ్గ‌రుండి స్కామ్‌లు న‌డిపిస్తున్నారు. రైతుల మీద చిత్తశుద్ధి లేదు. ఎవరిపై చర్యలు లేవు. దోచుకో.. పంచుకో.. తినుకో.. అనే తీరులో అంతా నడుస్తోంద‌ని జ‌గ‌న్ సెటైర్స్ వేశారు. రైతుల తరఫున తాము నిర‌స‌న‌లు చేస్తే పోలీసులతో బెదిరింపులకు పాల్పడతారా? రైతుల పక్షాన నిలబడి ప్రశ్నించడం తప్పా? అంటూ కూటమి సర్కార్‌ను జగన్ ప్రశ్నించారు. రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ స్కామ్‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: