ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఒక పార్టీకి అనుకూలంగా ఉన్న సమయం ఒక్కసారిగా మరో పార్టీకి బలాన్నిస్తుంటుంది. తాజాగా జరిగిన పరిణామాలు కూడా అదే విషయాన్ని చెబుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బామ్మర్ది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఆయన చేసిన రెండు కామెంట్లు విపరీతమైన చర్చలకు దారి తీశాయి. బాలకృష్ణ అసెంబ్లీలో జగన్‌ను "సైకో" అంటూ వ్యాఖ్యానించడమే కాకుండా, చిరంజీవిపై కూడా మాట్లాడిన తీరు ఇప్పుడు కూటమిలో కలకలం రేపుతోంది. వైసీపీ మాత్రం ఈ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. ఎందుకంటే చిరంజీవి గురించి చేసిన కామెంట్లపై స్వయంగా మెగాస్టార్ స్పందించడం పెద్ద చర్చకు దారి తీసింది.

 జగన్ తనను ఎప్పుడూ అవమానించలేదని, గౌరవంగా ఆహ్వానించారని చిరంజీవి చెప్పడం ద్వారా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో చేసిన ఆరోపణలు తప్పు అని తేలిపోయేలా చేసింది. దీంతో వైసీపీ పెద్ద ఊపిరి పీల్చుకుంది. ఇక కాపు సామాజిక వర్గంలో ఈ విషయం మరింత హాట్‌గా మారింది. గోదావరి జిల్లాల్లోని కాపులు జనసేన మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన కామెంట్లను ఎందుకు ఖండించలేదని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో రాయలసీమలోని బలిజ వర్గం నుంచి కూడా వ్యతిరేక స్వరం వినిపిస్తోంది. జనసేన ప్రధాన నేతలు పవన్ కల్యాణ్, నాగబాబు ఈ విషయంపై మౌనం పాటించడంతో పరిస్థితి మరింత సంక్లిష్టమైంది.

ఇదే సమయంలో టీడీపీ పెద్దలు కూడా ఈ కామెంట్లపై ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోవడం చిరంజీవి అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది. దీంతో కాపు కమ్యూనిటీలో విపరీతమైన చర్చ మొదలైంది. వైసీపీ మాత్రం ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. "జగన్ సైకో" అన్న మాటతో ఒకవైపు దెబ్బతిన్నా, "చిరంజీవి గౌరవించబడ్డారు" అన్న మెసేజ్ రావడం వల్ల మరోవైపు వాతావరణం తమకు అనుకూలమైందని వైసీపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. మొత్తానికి, బాలయ్య ఒక్క వ్యాఖ్యతోనే రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఈ ఇష్యూ ఎంతదాకా వెళ్తుందో చూడాలి కానీ, ప్రస్తుతం మాత్రం వైసీపీ లాభాల్లోనే ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: