
ఈ పరిస్థితిని చాకచక్యంగా వాడుకోవాలని టీడీపీ వ్యూహంతో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్థాయిలోనే వైసీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్సీలను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అదే రోజు గుంటూరు రాజకీయ వర్గాల్లో ఒక కొత్త చర్చ మొదలైంది. వైసీపీ ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు బలం చేకూర్చాయి. ఆయన “తొట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వడంలో తప్పేం లేదు” అని స్పష్టంగా చెప్పారు. దీంతో ఆయన టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.
ఏసురత్నం గతంలో పోలీసు శాఖలో పనిచేసి, వడ్డెర సామాజిక వర్గానికి చెందిన బీసీ నాయకుడిగా ఎదిగారు. 2019లో గుంటూరు వెస్ట్ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆయన, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఈ నేపధ్యంలో ఆయన టీడీపీ వైపు మారితే, బీసీ వర్గాల ఓటు బ్యాంక్‌లో కూడా టీడీపీకి అదనపు బలం దక్కుతుందని రాజకీయ లెక్కలు వేస్తున్నారు. టీడీపీ లెక్కల ప్రకారం, మండలిలో వైసీపీ నుంచి నలుగురిని తమవైపు తిప్పుకుంటే చాలనేది అంచనా. అలా జరిగితే చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చే బిల్లుతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన మరిన్ని కీలక బిల్లులు కూడా సులభంగా ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాలు ఏసురత్నం దిశగా టీడీపీ అడుగులు వేస్తోందని స్పష్టంగా చెబుతున్నాయి. అయితే వైసీపీ నుండి బయటకు వచ్చి టీడీపీలో చేరతారా? లేక చివరి నిమిషంలో పరిస్థితులు మారిపోతాయా? అన్నది చూడాలి.