
తన అసంతృప్తిని వ్యక్తపరిచే ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్న జితన్ రామ్ మాంఝీ, ప్రముఖ హిందీ కవి రామ్ ధారీ సింగ్ దినకర్ రచించిన “రష్మి రధి” కావ్యంలో కొన్ని పంతులను సవరిస్తూ నేటి రాజకీయ పరిస్థితులకు అన్వయించేలా సోషల్ మీడియా వేదికలపై పోస్ట్ చేశారు. ఆయన ఆ కవితలోని పాఠాలను ఉటంకిస్తూ, “మహాభారతంలో పాండవులు కేవలం ఐదు ఊర్లు మాత్రమే అడిగారు… మేము 15 స్థానాలు అడుగుతున్నాం. ఇవి ఇచ్చేస్తే చాలు, మిగతా స్ధానాలు మీరే ఉంచుకోండి” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.తర్వాత మీడియాతో మాట్లాడిన మాంజీ, “ఎన్డీఏ నేతల తీరును మేము అవమానంగా భావిస్తున్నాం. మా పార్టీకి గుర్తింపు రావాలి, గౌరవం కావాలి. నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని నేను ఎప్పుడూ అనలేదు. మా డిమాండ్ సూటిగా ఉంది — పార్టీకి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలి. అదే గౌరవం” అని స్పష్టంగా తెలిపారు.
ఇంతకాలం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విశ్వాసం ఉంచిన జితన్ రామ్ మాంఝీ అకస్మాత్తుగా తన వైఖరిని మార్చుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో బీజేపీ అధిష్ఠానం వెంటనే రంగంలోకి దిగినట్లు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పి. నడ్డా స్వయంగా జితన్ రామ్ మాంఝీకి ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని జాతీయ స్థాయిలో వార్తలు వెలువడుతున్నాయి. బీహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఎన్డీఏ కూటమిలో ఏర్పడిన ఈ సీట్ల తగాదా రాబోయే రోజుల్లో మరిన్ని రాజకీయ కలకలాలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు..!!