జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు..తెలంగాణ రాష్ట్రమంతా ఎవరి నోట విన్నా ఈ ఎన్నికల గురించే మాట్లాడుతున్నారు. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ మరోవైపు కాంగ్రెస్ ఇంకోవైపు బిజెపి పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. అంతేకాదు బడాబడా నాయకులంతా జూబ్లీహిల్స్ లోనే తిష్ట వేసి వారి వారి పార్టీల అభ్యర్థులకు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, కేటీఆర్ లీడ్ తీసుకొని ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లో మాత్రం ఎక్కువగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉండేటట్టు కనిపిస్తోంది. ఎవరు గెలిచినా కొద్దిపాటి మెజారిటీతో మాత్రమే గెలుస్తారు. ఇందులో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పోటీలో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. అలాగే కాంగ్రెస్ నుంచి యువ నాయకుడు నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. 

ఈ విధంగా ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ నడుస్తున్న సమయంలో ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇదంతా ఒకెత్తయితే ఈసారి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గందరగోళం ఏర్పడేటట్టే ఉంది.. ఆనాడు నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో ఏవిధంగా అయితే గందరగోళం ఏర్పడిందో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా నిజామాబాద్ ను తలపించేలా కనిపిస్తోంది. నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో ఎంతోమంది పసుపు రైతులు నామినేషన్లు వేశారు. దాదాపుగా 200లకు పైగా నామినేషన్లు దాఖలు అయ్యాయి.

ఒక్కో పోలింగ్ సెంటర్లో 12 ఈవీఎంలు పెట్టి ఎన్నికలు నిర్వహించారు. అలాంటి పరిస్థితి జూబ్లీహిల్స్ లో కూడా గోచరించేటట్టే కనిపిస్తోంది. ఇక్కడ కూడా వందలాది మంది వ్యక్తులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే 211 మంది అభ్యర్థులు కలిసి 230 నామినేషన్లు దాఖలు చేశారు. దీన్ని బట్టి చూస్తే మాత్రం ఒక్కో పోలింగ్ స్టేషన్లో 20 ఈవీఎంలు తప్పకుండా పెట్టాలి. ఇందులో ఓటు వేయాలంటే కనీసం ఐదు నిమిషాలు చూసి మరీ ఓటు వేయాల్సి వస్తుంది. మరి చూడాలి నామినేషన్ ల ఉపసంహరణ వరకు ఈ వ్యక్తులను బుజ్జగించి ఉపసంహరించేలా చేస్తారా.. లేదంటే  సైలెంట్ గా ఉంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక పెద్ద విపత్తుగానే చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: