జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంట్‌డౌన్ మొదలైంది. ఇంకో 13 రోజుల్లో - నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. దానికి ముందు రోజు అంటే నవంబర్ 9 సాయంత్రం ప్ర‌చారం ఆగిపోతుంది. అంటే మొత్తం మీద కేవలం 13 రోజుల గడువు మాత్రమే! ఈ తక్కువ టైమ్‌లో పార్టీలు ఏం చేయాలో, ఎలాగో అని ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. మూడు ప్రధాన పార్టీలు - బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ - ఒక్కో అడుగు వేసే సరికి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రతీ ఒక్కరూ జూబ్లీహిల్స్ ఓటర్లను ఆకర్షించడానికి కొత్త కొత్త ప్లాన్‌లు వేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ మంది బరిలో ఉన్నారు.
 

దీంతో ఓట్లు చీలిపోవచ్చనే భయం పార్టీలను కమ్మేసింది. కులాల ఆధారంగా, మతాల ఆధారంగా, యువత ఓట్లపై కూడా లెక్కలు వేసుకుంటూ వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఇక బీఆర్‌ఎస్ పార్టీ అయితే మరో స్టెప్ ముందుకేసింది. ఈసారి కూడా “ఉప ఎన్నిక మ్యానిఫెస్టో” ఇవ్వాలని ఆలోచిస్తోంది. సాధారణంగా సార్వత్రిక ఎన్నికల సమయంలోనే మ్యానిఫెస్టోలు ఇస్తారు. కానీ బీఆర్‌ఎస్ మాత్రం మునుగోడు, నల్లగొండ ఉప ఎన్నికల్లో మొదలుపెట్టిన ఆ ట్రెండ్‌ను ఇప్పటికీ కొనసాగిస్తోంది. “గెలిస్తే ఇలా చేస్తాం, ఆ హామీలు ఇలా నెరవేర్చుతాం” అంటూ స్థానిక సమస్యల ఆధారంగా ప్రత్యేక హామీలు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. కాంగ్రెస్, బీజేపీ కూడా ఇప్పుడు అదే దారిలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

బీఆర్‌ఎస్ ఇచ్చే హామీలకు సమాధానంగా, “మేమూ చేస్తాం” అంటూ తమ మ్యానిఫెస్టోలు ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి మ్యానిఫెస్టోలు పార్టీ స్థాయి కాకుండా వ్యక్తిగతంగా అభ్యర్థి ఆధారంగా ఉండబోతున్నాయి. అంటే - “నేను గెలిస్తే మీకిదీ చేస్తాను, మీ సమస్యను నేనే పరిష్కరిస్తా” అనే పర్సనల్ టచ్ ఇవ్వాలనే ప్లాన్! ఇక చివరి వారం నుంచి జూబ్లీహిల్స్ వీధుల్లో ప్ర‌చారం హీట్ మరింత పెరగనుంది. బీఆర్‌ఎస్‌కి ఇది ప్రతిష్టాత్మక పోరు, కాంగ్రెస్‌కి ప్రతిభా పరీక్ష, బీజేపీకి ప్ర‌తిష్ట పునరుద్ధరణ యత్నం. ప్రతీ ఒక్కరు గెలుపు గుర్రం ఎక్కడుందో అంచనా వేస్తున్నారు. మొత్తానికి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక “హామీల హోరా హోరీ” గా మారింది. ఎవరి మాట నమ్ముతారు ప్రజలు? ఎవరి మ్యానిఫెస్టో వాస్తవమవుతుంది? నవంబర్ 11నే ఆ సమాధానం ఇస్తుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: