తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంబై పర్యటన, బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌ను కలవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆ ఫోటో బయటకు వచ్చే వరకు రేవంత్ ముంబై వెళ్లిన సంగతి ఎవరికీ తెలియదు. సీఎం ఏదైనా అధికారిక ప్రోగ్రాం కోసం వెళ్లారా లేదా అన్నదానిపై స్పష్టత లేకపోయినా, ఆయన సల్మాన్ ఖాన్‌ను ఆయన నివాసంలో కలిసిన ఫోటో మాత్రం వైరల్ అయింది. భేటీ వెనుక అసలు కారణం ఏమిటి? .. రేవంత్ రెడ్డి సల్మాన్ ఖాన్‌ను ఎందుకు కలిశారన్నదానిపై స్పష్టమైన వివరాలు లేవు. కానీ, చాలా మంది ఈ భేటీని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికతో ముడిపెడుతున్నారు.
 

ఈ నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్నారు. ముస్లిం వర్గాల్లో, ముఖ్యంగా యూత్‌లో, సల్మాన్ ఖాన్‌కు అపారమైన క్రేజ్ ఉంది. మైనార్టీ ఓటర్లను ప్రభావితం చేయడానికి రేవంత్ రెడ్డి ఈ పర్యటన పెట్టుకుని ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, సల్మాన్ ఖాన్ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటన చేయకపోయినా, కేవలం ఈ ఫోటో చాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారేమో తెలియదు. కాంగ్రెస్ కంటే బీఆర్‌ఎస్ ప్రచారమే ఎక్కువ! .. ఈ అనూహ్య ఫోటోకు కాంగ్రెస్ నేతల కంటే బీఆర్‌ఎస్ (BRS) నేతలే ఎక్కువగా ప్రచారం కల్పిస్తున్నారు. రేవంత్ ఎందుకు కలిశారనే విషయంపై స్పష్టత లేకపోవడంతో, కాంగ్రెస్ క్యాడర్ ఈ ఫోటోను పోస్ట్ చేయడానికి సంశయిస్తోంది.



కానీ, బీఆర్‌ఎస్ నాయకులు మాత్రం దీనిని విమర్శనాస్త్రంగా మార్చుకున్నారు. "ఓ వైపు తెలంగాణ వరదలతో అల్లాడిపోతూంటే, రేవంత్ ముంబై వెళ్లి సల్మాన్‌ను కలిశారని" తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. అనుకోని సాయం! బీఆర్‌ఎస్ చేస్తున్న ఈ ప్రచారం, కాంగ్రెస్‌కు కావాల్సిందే అందిస్తున్నట్లయింది. ముఖ్యంగా మైనార్టీ ఓటర్లను ఆకట్టుకోవడానికే రేవంత్ ఈ ప్రయత్నం చేసి ఉంటే, ఆ ప్రయత్నానికి బీఆర్‌ఎస్ ఉచితంగా, గట్టిగా సహాయం చేస్తుందని అనుకోవాలి. ప్రభుత్వ పనులను పక్కనబెట్టి స్టార్‌ను కలవడానికి వెళ్లారనే విమర్శ ఒకవైపు ఉన్నప్పటికీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మైనార్టీలను లక్ష్యంగా చేసుకున్న రేవంత్ వ్యూహం ఫలితాన్ని ఈ బీఆర్‌ఎస్ ప్రచారమే అందిస్తోందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: