
‘ఢిల్లీ పెద్దలకు కేసీయార్ భయపడుతున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి భయపడటం లేదు’
‘తనమీదున్న కేసులను కూడా జగన్ లెక్క చేయకుండా వాటినికి ఎదుర్కోవటానికే జగన్ సిద్దంగా ఉన్నారు’.. ఇవి తాజాగా ఆర్కే రాసిన చెత్తపలుకులోని రెండు వాక్యాలు. నిజానికి జగన్ గురించి యావత్ ప్రపంచానికి ఎప్పుడో తెలిసిన విషయాలను ఎల్లోమీడియా ఎండి వేమూరి రాధాకృష్ణ తెలుసుకోవటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఒకపుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో సోనియాగాంధీ పేరు ప్రముఖంగా వినిపించేది. ఎందుకంటే యూపీఏ అధినేతగా సోనియా దేశంలో ఓ వెలుగు వెలిగిపోయారు. ఆ రోజుల్లోనే సోనియా ఆధిపత్యంపై జగన్ గట్టిదెబ్బ కొట్టి కాంగ్రెస్ లో నుండి బయటకు వచ్చారు. పార్టీలో నుండి బయటకు వచ్చేస్తే ఇబ్బందులు తప్పవని తెలిసినా సోనియాను ధిక్కరించి బయటకు వచ్చారంటేనే జగన్ దైర్యమేమిటో అందరికీ అప్పుడే అర్ధమైంది. ఆదాయానికి మించిన కేసులు పెట్టి 16 మాసాలు జైలులో పెట్టినా ఎవరికీ లొంగకుండా పోరాటం చేశారు. ఆ పోరాటం కారణంగానే జనాల్లో హీరో అయ్యారు.
ఇక 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు కూడా జగన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టారో అన్నీ పెట్టారు. వైసీపీ తరపున గెలిచిన ఎంఎల్ఏలు, ఎంపిలను లాగేసుకుంటున్నా జగన్ భయపడలేదు. జగన్ కు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేయాలని చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. సోనియా గాంధీనే ధైర్యంగా ఢీకొన్న జగన్ ఇపుడు ప్రధానమంత్రి నరేంద్రమోడికి లొంగిపోతాడని వేమూరి ఎలా అనుకున్నారో అర్ధం కావటం లేదు. తనపై కేసులు పడతాయని, విచారణను ఎదుర్కోవాల్సొస్తుందని తెలిసి కూడా సోనియాను ఎదిరించటానికి జగన్ వెనకాడలేదు. అలాంటిగి ఒకసారి 16 మాసాలు జైలుకెళ్ళొచ్చిన తర్వాత జగన్ ఇక ఎవరికైనా ఎందుకు భయపడతారు ? అసలెందుకు భయపడాలి ?
ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇబ్బందులు పెడదామని చంద్రబాబు ఎంతగా ప్రయత్నించినా జగన్ ఏమాత్రం లెక్కచేయలేదు. అలాంటిది ఇపుడు ముఖ్యమంత్రి స్ధానంలో కూర్చున్న తర్వాత ప్రధానమంత్రికి అయినా న్యాయస్ధానాలకైనా జగన్ ఎందుకు భయపడతారు. పైగా తొమ్మిది సంవత్సరాలకుపైగా అక్రమార్జన కేసులను విచారిస్తున్న కేసుల్లో ఒక్కదానిలో కూడా ఇంతవరకు సీబీఐ, ఈడీ తగిన సాక్ష్యాధారాలను చూపలేకపోయింది. విచారణ పేరుతో అదుపులోకి తీసుకుని జగన్ను సీబీఐ అరెస్టు చేసి జైల్లో పెట్టింది. వైసీపీ నేతల ప్రకారం ఎటువంటి కారణాలు లేకుండానే కోర్టు కూడా జగన్ను 16 మాసాలవరకు బెయిల్ కూడా ఇవ్వలేదు. ఇలాంటి అనేక ఎదురుదెబ్బలు తిన్నారు కాబట్టే జగన్ ఇపుడు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని అనుకున్నారు. అందుకనే తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుంటు ముందుకెళుతున్నారు. జగన్ కు సంబంధించిన ఈ విషయాలన్ని జనాలు చాలా కాలం క్రితమే అర్ధం చేసుకున్నారు. మొండితనమే జగన్ కు ప్లస్సు, మైనస్సు కూడా అని అందరికీ తెలిసిందే. అందరికీ ఎప్పుడో తెలిసిన విషయం ఎల్లోమీడియా మ్యానేజ్మెంటుకు ఇపుడు తెలియటమే ఆశ్చర్యంగా ఉంది.