మేడారం జాతరకు ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేస్తున్నా.. అనుబంధ ఆలయాలను పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జాతరలో కీలక పూజలు అందుకునే పగిడిద్ద రాజు, గోవింద రాజు ఆలయాల్లో కనీస ఏర్పాట్లు చేయడంలేదు అధికారులు. అవి కూలిపోయే పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

 

మేడారం సమ్మక్క భర్తగా పూజలు అందుకుంటున్న పగిడిద్దరాజు ఆలయమిది. మూడు దశాబ్దాల కిందట పూనుగొండ్ల గ్రామస్థులు స్వచ్ఛందంగా చందాలు వేసుకుని ఈ ఆలయం నిర్మించారు. ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. పగుళ్లు ఏర్పడి గోడలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. గుడి పునాదులకు కూడా పగుళ్లు వచ్చాయి. మేడారం జాతరకు రెండేళ్లకోసారి ప్రభుత్వం 100కోట్ల వరకూ ఖర్చు చేస్తుంది. అయినా, పగిడిద్ద రాజు ఆలయంపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

 

మేడారం జాతరలో అనుబంధ ఆలయాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇక్కడికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం లేదు. మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లలో పగిడిద్దరాజు ఆలయం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ నయాపైసా కూడా ఈ ఆలయానికి కేటాయించలేదు. ఈ గుడి గురించి అనేకసార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులకు విన్నవించినా ఫలితం దక్కలేదు. అధికారులు కనీసం పగుళ్లను పూడ్చే ప్రయత్నం కూడా చేయలేదు.

 

జాతరకు కొన్ని రోజుల ముందు అధికార యంత్రాంగం పూనకం వచ్చినట్లు పనులు చేపడతారు. హడావిడి చేస్తారు. ప్రతి రెండేళ్లకోసారి వందల కోట్లు ఖర్చు చేస్తారు. కానీ, శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు, సౌకర్యాల ఏర్పాటు గురించి పట్టించుకోరు. మేడారం గద్దెలకు గోవిందరాజును తీసుకెళ్లే సమయంలో బిందెలతో నీళ్లారబోస్తారు. కొంతమంది భక్తులు పొర్లుదండాలు పెడతారు. నీళ్లతో నేలంతా బురదగా మారుతుండటంతో భక్తులు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

 

సమ్మక్క- సారలమ్మ జాతరకు ఒక్కరోజు ముందు అంటే  ఫిబ్రవరి 4న పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయంలో పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. పగిడిద్దరాజు పడగ, పూజా సామాగ్రితో 80మంది పూజారులు దాదాపు 55 కిలోమీటర్ల మేర మేడారానికి మహా పాదయాత్ర చేస్తారు. ఈ దారి కొండలు, గుట్టలు, చెట్లు, వాగులతో నిండి ఉంటుంది. పగిడిద్దరాజు జాతర ప్రవేశానికి రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు పూజారులు. తిరుగువారం పండగకు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: