
ఐపీఎల్ 2025లో జరిగిన ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ చానెల్‌లో చర్చలో పాల్గొన్న భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎంఎస్ ధోనీకి మాత్రమే నిజమైన అభిమానులు ఉన్నారు. మిగిలిన క్రికెటర్లందరికి ఉన్నది పెయిడ్ ఫ్యాన్సే. సోషల్ మీడియాలో వారికి ఉన్న ఫాలోయింగ్ అంతా నిజమైనది కాదు. ఈ విషయంపై మాట్లాడడం అవసరం లేదు. ఎందుకంటే ఇది చర్చను పక్కదారి పడేస్తుందని వ్యాఖ్యానించాడు.
ఇకపోతే, ఇప్పటికే ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు ఊపందుకున్నాయి. కానీ, ధోనీ తాను ఇంకా ఆడతానని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి తెలిపినట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో హర్భజన్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, ఐపీఎల్‌లో ధోనీ ఎప్పటివరకు ఆడాలనుకుంటే, అప్పటివరకూ కొనసాగిస్తాడని హర్భజన్ వ్యాఖ్యానించడం ఓ విధంగా ధోనీకి మద్దతుగా కనిపించినా, ఇతర క్రికెటర్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.
మరోవైపు, హర్భజన్ చేసిన ఈ వ్యాఖ్యలపై విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అభిమానులు మండిపడుతున్నారు. తమ అభిమాన క్రికెటర్ ను కించపరిచేలా తమపై వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో వ్యతిరేక ప్రచారానికి దిగారు. ముఖ్యంగా "SHAME ON DESHDROHI DHONI" అనే హ్యాష్‌ట్యాగ్ X (మాజీగా ట్విట్టర్) లో ట్రెండ్ అవుతోంది.
ధోనీ ఫ్యాన్ బేస్ స్వతహాగా ఏర్పడింది. అదే విధంగా కోహ్లీ, రోహిత్ లాంటి దిగ్గజాలకు కూడా తాము చూపిన ప్రతిభ, కనిష్ట స్థాయిలో మొదలైన పోరాటం వల్లే అభిమానుల మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో హర్భజన్ చేసిన వ్యాఖ్యలు అనవసరంగా చిచ్చు రేపినట్లుగా అభిమానులు భావిస్తున్నారు.