ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను తమ పవర్‌ హిట్టింగ్‌తో శాసించిన వెస్టిండీస్ జట్టు, ఇప్పుడు టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత అవమానకరమైన రీతిలో తలదించుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో, 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 27 పరుగులకే కుప్పకూలింది. ఇది టెస్టు క్రికెట్ చరిత్రలోనే రెండో అత్యల్ప స్కోరు. సొంతగడ్డపై ఇంతకంటే దారుణమైన ఓటమి మరొకటి ఉండదేమో.

జమైకాలోని సబీనా పార్క్ వేదికగా జరిగిన ఈ డే-నైట్ టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా, తన 100వ టెస్టు ఆడుతున్న మిచెల్ స్టార్క్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పింక్ బంతితో విండీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. కేవలం 15 బంతుల్లోనే ఐదు వికెట్లు పడగొట్టి, టెస్టుల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. మొత్తంగా ఈ ఇన్నింగ్స్‌లో 7.3 ఓవర్లలో 9 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. ఇదే మ్యాచ్‌లో స్టార్క్ తన టెస్ట్ కెరీర్‌లో 400 వికెట్ల మైలురాయిని కూడా అందుకున్నాడు.

స్టార్క్ దెబ్బకు తోడు, స్కాట్ బోలాండ్ కూడా హ్యాట్రిక్‌తో విండీస్ పతనాన్ని శాసించాడు. దీంతో కరేబియన్ జట్టులో ఏకంగా ఏడుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ఏడుగురు బ్యాటర్లు సున్నాకే వెనుదిరగడం ఇదే తొలిసారి.

ఈ ఘోర పరాభవంతో వెస్టిండీస్ జట్టు పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోరు. 1955లో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ 26 పరుగులకు ఆలౌటైన తర్వాత ఇదే అత్యంత తక్కువ స్కోరు. గత 70 ఏళ్లలో ఇదే అత్యల్ప టెస్ట్ స్కోరు.

డే-నైట్ టెస్టుల్లో నమోదైన అత్యంత చెత్త స్కోరు కూడా ఇదే. టెస్టుల నాల్గవ ఇన్నింగ్స్‌లో ఇది అత్యల్ప స్కోరు. 129 ఏళ్ల క్రితం 1896లో ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా నమోదు చేసిన 30 పరుగుల రికార్డును విండీస్ బద్దలు కొట్టింది.

ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 121 పరుగులకు ఆలౌటై, విండీస్‌కు 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, ఆసీస్ బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.

ఈ ఓటమిపై వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్ మాట్లాడుతూ, "ఈ స్థితిలో ఉండటం హార్ట్ బ్రేకింగ్ గా ఉంది. మా బ్యాటింగ్ వైఫల్యం సిరీస్ మొత్తం రిపీట్ అయింది, ఇది మరింత నిరాశకు గురిచేసింది" అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పతనం వెస్టిండీస్ క్రికెట్ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: