ఏపీ ఉప ముఖ్య‌మంత్రి పుష్పశ్రీవాణిపై మరో కుల వివాదం కేసుకు సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖ‌లైంది. పుష్పశ్రీవాణి గిరిజన తెగకు చెందిన వ్యక్తి కాదంటూ ఏపీ షెడ్యూల్ ఏరియా ఆదివాసీ సంఘం తాజాగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయ‌గా ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలంటూ ఏపీ ట్రైబుల్ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్ సెక్రటరీకి రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానం ఆదేశాలు జారీచేసింది. విజయనగరం జిల్లా కురుపాం (ఎస్టీ) నియోజకవర్గం నుంచి పుష్పశ్రీవాణి 2019 ఎన్నిక‌ల్లో వైకాపా తరపున పోటీచేసి గెలిచారు. జగన్ మంత్రివర్గంలో ఉప ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్నారు. అయితే ఆమె ఎస్టీ కాదంటూ గత కొంత కాలంగా వివాదం న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. పుష్పశ్రీవాణి సోదరి రామ తులసిని ఎస్టీ కాదని పేర్కొంటూ ఆమెను ప్రభుత్వ ఉద్యోగం నుంచి గతంలో తొలగించ‌డంతో ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా ఎస్టీ కాదని పలువురు కోర్టు త‌లుపులు త‌ట్టారు. అయితే తన సోదరిని  కులం కారణంగా ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించలేదని, నాన్ లోకల్ కారణంగానే ఉద్యోగం నుంచి రామ తులసిని తొలగించారని పుష్పశ్రీవాణి ప‌లు సంద‌ర్భాల్లో చెప్ప‌డంతోపాటు కోర్టు కేసుల విష‌యంలో కూడా వివ‌ర‌ణ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap