
అయితే.. ట్రయల్స్‌లో పాల్గొనడం వల్ల తాను తీవ్ర అనారోగ్యానికి గురయ్యానని, టీకా వల్ల కలిగిన ప్రతికూల ఫలితాలే ఇందుకు కారణమని, తన అనారోగ్యానికి కారణమైన సీరమ్ సంస్థ నష్ట పరిహారంగా తనకు రూ.5 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాకు కూడా లీగల్ నోటీసులు కూడా పంపారు.
ఈ ఆరోపణలపై సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వలంటీర్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినప్పుడు రిపోర్టులో ‘అక్యూట్ ఎన్‌సెఫలోపతి’ నుంచి కోలుకుంటున్నట్లు ఉందని, విటమిన్ బీ12, విటమిన్ డీ లోపాలతో పాటు ‘కనెక్టివ్ టిష్యూ డిజార్డర్’తో అతడు బాధపడుతున్నాడని తెలిపింది. ట్రయల్స్ నిర్వహించిన శ్రీరామచంద్ర ఇన్‌స్టిట్యూట్ తెలిపిన అంశాల ప్రకారం.. వలంటీర్ అనారోగ్యానికి కొవిషీల్డ్ ఎంత మాత్రమూ కారణం కాదని, సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ఆ వ్యక్తి ఇలాంటి చర్యలకు దిగాడని ఆరోపించింది. ఇదే విషయాన్ని డీసీజీఐకూ నివేదించామని వెల్లడించింది.
ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న వలంటీర్‌పై తమకు సానుభూతి ఉందని, అయితే ఆ అనారోగ్యానికి.. క్లినికల్ ట్రయల్స్‌కు ఎలాంటి సంబంధం లేదని చేప్పింది. ఆయన చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం సత్యం లేదని సీరం పేర్కొంది. ‘సదరు వలంటీర్ చేస్తున్న ఆరోపణలు దురుద్దేశంతో కూడుకున్నవి. ఆయన అనారోగ్యాన్ని కావాలనే క్లీనికల్ ట్రయల్స్‌కు ముడిపెడుతున్నారు. మా మెడికల్ టీం ఈ విషయాన్ని అతడికి స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ సంస్థ పరువు తీసేందుకు అతడు బహిరంగంగా ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నాడు. ఇందుకు గాను అతడిపై రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేసేందుకూ వెనుకాడం’ అంటూ సీరమ్ పేర్కొంది.