కరోనా వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటోంది. అందులో భాగంగా నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లక్షా డెబ్బై వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. 
 
కరోనా నేపథ్యంలో తాజాగా ఆర్బీఐ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఆర్బీఐ రేపో రేటును 75 బేసిక్ పాయింట్లు తగ్గించడంతో పాటు.... రివర్స్ రెపో రేటును 90 పాయింట్లకు కుదించింది. ఆర్బీఐ ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తోందని... ఆర్థిక స్థిరత్వం కోసం అవసరమైన కీలక నిర్ణయాలను తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. నిన్న కేంద్రం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించగా ఈరోజు ఆర్బీఐ కీలక నిర్ణయాలను తీసుకోవడం గమనార్హం. 
 
ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడంతో రెపో రేటు 4.4 శాతానికి దిగొచ్చింది. ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగానే ఉన్నాయని... ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రజల డబ్బులు సురక్షితంగా ఉన్నాయని చెప్పారు. ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత కూడా దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతంగానే ఉందని వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలోకి 3.74 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రకటన చేశారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: