ములుగు జిల్లాలోని వెంకటాపురం,వాజేడు మండలాల్లో సీడ్ ఆర్గనైజర్ల మోసాలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. మొక్కజొన్న సీడ్ ఆర్గనైజర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అగ్రిమెంట్ లేకుండా రైతులకు సీడ్ మొక్కజొన్న విత్తనాలు అంటగడుతున్న దుస్థితి నెలకొంది. దిగుబడి రాని పక్షంలో తమకు సంబంధం లేదనే రీతిలో ఆర్గనైజర్లు వ్యవహరిస్తున్నారు. రైతులు తమకు జరిగిన మోసాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిగులు చెందుతున్నారు. వెంకటాపురం, వాజేడు మండలాల్లోని గోదావరి పరివాహక ప్రాంతం నల్లరేగడి నేల వ్యవసాయానికి అనువుగా ఉంటుంది. ఇక్కడ వేసే పంటలకు డిమాండ్ బాగా  ఉంది. ఈ క్రమంలో విత్తన కార్పొరేట్ కంపెనీల కన్ను ఏజెన్సీలోని సారవంతమైన భూములు పైన పడింది. దీంతో కొన్ని బహుళజాతి కంపెనీలు ఆర్గనైజర్ లను ఏర్పాటు చేసుకొని రైతులతో మొక్కజొన్న విత్తన వ్యవసాయం చేయిస్తున్నారు.వెంకటాపురం మండలంలో సింజెంటా, పయనీర్, సిపీ, కావేరి రకాలకు చెందిన మొక్కజొన్న సాగు చేయిస్తున్నారు. మండల పరిధిలోని బెస్త గూడెం, మరికాల,నూగూరూ,చొక్కాల,ఉప్పేడు,గోదావరి పరివాహక ప్రాంతాలైన గడ్డపై సుమారు వెయ్యి ఎకరాల్లో సింజెంటా, బెస్తగూడెం, వీరభద్రవరం గడ్డపై సుమారు నాలుగు వందల  యాభై ఎకరాల్లో సీపీ, మిగతా ప్రాంతాల్లో  పయనీర్, కావేరి రకాల విత్తనాలు అంటగడుతూ వ్యవసాయం చేయిస్తున్నారు.

ఎకరానికి 5 నుంచి 6 టన్నుల దిగుబడి వస్తుందని సింజెంటా టన్నుకు 24 వేల రూపాయలు, సిపి రకం టన్నుకు 20 వేల రూపాయలు, పయనీర్  టన్నుకు 22 వేల రూపాయలకు మించి పరిస్థితులను బట్టి ధర చెల్లిస్తామంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మొదట గింజలు నాటే సమయం లో ఎకరానికి 10 నుంచి 15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని, పంట కు కావాల్సిన ఎరువులు, పురుగు మందులు తామే అందిస్తామని నమ్మిస్తున్నారు. ఆర్గనైజర్లు సూచించిన రీతిలోనే రైతులు వ్యవసాయం చేయాల్సి వస్తుంది. ఆర్గనైజర్లు చెప్పిన మేరకు దిగుబడి రాకున్నా, వారు ముందుగా నిర్ణయించిన ధర రైతులకు చెల్లించకున్నా పట్టించుకునే నాధుడే లేడు .

మరింత సమాచారం తెలుసుకోండి: