తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయాలు కాకలు పుట్టిస్తున్నాయి. నవంబరు 30న పోలింగ్ జరగనుండటంతో ఘాటైన విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారం లోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే తొలిసారి అధికారం చేజక్కించుకునేందుకు కాంగ్రెస్ తహతహలాడుతోంది. మరోవైపు బీజేపీ కూడా హంగ్ వస్తే కింగ్ మేకర్ పాత్ర కోసం ఎదురు చూస్తూ ఉంది.  అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు, ఆరోపణలు చేస్తోంది తప్ప బీజేపీని పెద్దగా పట్టించుకోవడం లేదు.


అయితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు ఉందని విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అని ఆరోపిస్తూ వస్తోంది.  రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీని లైట్ తీసుకుంటున్నారు. దీని వెనుక కారణాలను రేవంత్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గాల్లో కత్తి తిప్పడం వల్ల లక్ష్యం గురి తప్పుతుంది. బీజేపీ అసలు పోటీలోనే లేదు. అలాంటప్పుడు దాని గురించి చర్చించుకోవడం అనవసరం. నా ఎదురుగా పది తలల రావణాసురుడు ఉన్నప్పుడు కత్తిని వేరే దిక్కు వైపు చూపిస్తే ఆయన మనల్ని చంపేస్తారు. అలాగే నేను రావణాసురుడి లాంటి బీఆర్ఎస్ వదిలేసి బీజేపీ వైపు తిరిగితే .. వెంటనే బీజేపీ నేతలు ఆ రెండు పార్టీలు ఒకటే అని ప్రచారం మొదలు పెడతారు. గతంలో పొత్తు ఉంది. భవిష్యత్తులో కూడా పొత్తు పెట్టుకుంటాయి అని వ్యాఖ్యానిస్తుంటారని రేవంత్ అంటున్నారు.


దీనివల్ల ప్రజలు గందరగోళానికి గురవుతారు. కేసీఆర్ ని ఎందుకు వదిలిపెట్టారు అనే చర్చ ప్రజల్లో మొదలవుతుంది. మన దగ్గర రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీపైనే మేం పోరాడుతాం. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే సరికి ప్రధాని మోదీపై, ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తాం. ఎత్తి చూపుతాం. ఇప్పుడు బీజేపీని విమర్శించండం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. అది బీఆర్ఎస్ కు లాభిస్తుంది. అందుకే మేం బీజేపీని లెక్కలోకి తీసుకోవడం లేదని రేవంత్‌ రెడ్డి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: