దశాబ్దాల పాటు అవినీతికి, అక్రమాలకు పాల్పడిన ప్రముఖ విద్యాసంస్ధ ‘గీతం’ పాపం పండే రోజులు దగ్గరలోనే ఉన్నట్లు అనుమానంగా ఉంది. ఎందుకంటే వైసీపీ రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి సదరు విద్యాసంస్ధ అక్రమాలను రోజుకొకటిగా బయటకు తీసి కేంద్రప్రభుత్వంలోని సంస్ధలకు ఫిర్యాదులు చేస్తున్నారు. దాంతో గీతం యాజమాన్యం ఎంపి దెబ్బకు విలవిల్లాడిపోతోంది. దశాబ్దాల క్రితం ఏర్పడిన గీవం విద్యాసంస్ధ రాష్ట్రంలోని బాగా పాపులర్ సంస్ధల్లో ఒకటనటంలో సందేహం లేదు. రాష్ట్రప్రభుత్వంలో తమకున్న పట్టు ద్వారా కేంద్రంలో కూడా మ్యానేజ్ చేసుకుని ఏఐసీటీఇ, యూజీసీ లాంటి సంస్ధల నుండి గ్రీన్ సిగ్నల్ తెచ్చేసుకున్నాయి వివిధ అనుమతులతో. అందుకనే ప్రారంభించిన కొద్ది కాలంలోనే గీతంకు డీమ్డ్ యూనివర్సిటి హోదా కూడా వచ్చేసింది. అసలు ఈ విద్యాసంస్ధకు ఇంత తొందరగా కేంద్రం ఇన్ని అనుమతులు ఎలాగ ఇచ్చేసింది ? అన్నదే అందరినీ ఇంతకాలం వేధించిన ప్రశ్న.




అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత జరిగిన పరిణామాల్లో వెలుగుచూసిన వాస్తవాలతోనే గీతం యాజమాన్యం అసలు రహస్యం బట్టబయలైంది. ఇంతకీ ఆ రహస్యం ఏమిటంటే ప్రభుత్వ భూమిని తమ సొంత భూమిగా రికార్డుల్లో చూపించేసుకుని శాశ్వత భవనాలు కట్టేసుకుంది. ఏఐసిటిఇ, యూజీసీ నుండి తనిఖీలకు కమిటీలు వచ్చినపుడు  అవసరమైన భూమి, అవసరమైన శాశ్వత భవనాలు కనబడగానే కమిటిలు సంతృప్తి చెంది అవసరమైన అనుమతులు ఇచ్చేశాయి. అయితే ఇపుడు బయటపడిందేమంటే అసలు భూములు గీతం యాజమాన్యంవి కానేకాదని. ఆ భూమి మొత్తం ప్రభుత్వానిదని తేలిపోయింది. అంటే ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసేసి రికార్డుల్లో తమదిగా చూపించేసుకున్నారు. భూమి రిజిస్ట్రేషన్లు చూపించినపుడు కూడా రికార్డల పరంగా తమ భూమే అని చూపించటంతో కమిటిలు కూడా ఓకే చెప్పేశాయి.  పైగా రాజకీయంగా బలమైన నేపధ్యమున్న యాజమాన్యం కావటంతో అనుమతులకు అడ్డేలేకపోయింది.




ఇదంతా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బయటపడింది. దాంతో రెవిన్యు అధికారులు విచారణ జరిపినపుడు గీతం యాజమాన్యం 40 ఎకరాలను ఆక్రమించుకున్న విషయం బయటపడింది.  ఇక అప్పటి నుండి యాజమాన్యం విలవిల్లాడిపోతోంది. ఎందుకంటే కబ్జా చేసి కట్టుకున్న కాంపౌండ్ వాలును ప్రభుత్వం కూల్చేసింది.  కబ్జాలో ఉన్న స్ధలాన్ని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని బోర్డులు పెట్టేసింది. ఇదే సందర్భంలో  యాజమాన్యం చేసిన కబ్జాలపై ప్రభుత్వం విచారణ మొదలుపెట్టింది. ఇది చాలదన్నట్లుగా విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు.



యూజీసీని, ఐఏసిటీఇని గీతం యాజమాన్యం ఏ విధంగా మోసం చేసిందో ఆధారాలతో సహా పై సంస్ధలకు ఎంపి ఫిర్యాదులు చేశారు. ఏఐసీటీఇ అనుమతులతో పాటు యూజీసీ అనుమతులను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డీమ్డ్ యూనివర్సిటి హోదాను రద్దు చేయాలని తన ఫిర్యాదులో కోరటం సంచలనంగా మారింది. గీతంకున్న స్వతంత్రహోదాను రద్దు చేసి ఆంధ్ర యూనివర్సిటికి అఫిలియేట్ చేయాలని సూచించారు. మొత్తానికి గీతం యాజమాన్యం అక్రమాలు, అవినీతిని ఎంపి వెంటాడుతున్న విషయం అర్ధమైపోతోంది. మరి దీనికి ముగింపు ఎలాగుంటుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: