రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విచిత్రమైన పరిస్దితుల్లో ఇరుక్కున్నారు. మూడు సమస్యలు ఒకేసారి కమీషనర్ ను కమ్ముకుంటున్నాయి. మొదటిది ప్రివిలేజ్ కమిటి నోటీసు. రెండోది పరిషత్ ఎన్నికల నిర్వహణ. మూడోది ఎల్టీసీపై నాలుగురోజులు శెలవులో వెళ్ళటం సందిగ్దంలో పడటం. ఫైనల్ గా ఆయన రిటైర్మెంట. నిజానికి రిటైర్మెంట్ అన్నది ఎప్పుడో నిర్ణయమైపోయిన విషయం. ఎవరైనా రిటైర్మెంట్ ప్రశాంతంగా జరిగిపోవాలని కోరుకుంటారు. కానీ నిమ్మగడ్డ మాత్రం రిటైర్మెంట్ ముందు కోరి ప్రభుత్వంతో గొడవలకు దిగి సమస్యలను కొనితెచ్చుకున్నారు. ప్రభుత్వం అభిమతానికి భిన్నంగా వెళ్ళి కావాలనే ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ఎన్నికల నిర్వహణ విషయంలో కరోనా వైరస్ ను ప్రభుత్వం కారణంగా చెప్పి వాయిదా వేయాలని కోరితే కాదు కూడదని చెప్పి కోర్టులకు వెళ్ళి పంతాన్ని నెగ్గించుకున్నారు.



రాష్ట్రంలో కరోనా వైరస్ సమస్య లేనపుడేమో దాన్ని బూచిగా చూపించి ఏకపక్షంగా ఎన్నికలను వాయిదావేశారు. కరోనా సమస్యున్నపుడేమో ప్రభుత్వం ఎంత చెప్పినా వినకుండా కోర్టుకెక్కి ఆదేశాలు తెచ్చుకుని ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టారు. ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వాన్ని కోర్టుకీడ్చి నానా రచ్చచేశారు. ప్రజలముందు కావాలనే ప్రభుత్వం పరువును బజారుకీడ్చేశారు. సరే ఇంత జరిగిన తర్వాత ప్రభుత్వం కూడా స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు రెడీఅయిపోయింది. పంచాయితి, మున్సిపల్ ఎన్నికలను వరుసగా నిర్వహించేసిన నిమ్మగడ్డ మిగిలిపోయిన పరిషత్ ఎన్నికల మాటెత్తటం లేదు. పైగా రిటైర్మెంట్ ముందు ఎల్టీసీపై ఐదురోజులు శెలవులో వెళుతున్నారు. ఇక్కడే ప్రభుత్వానికి మండింది.




మున్సిపల్ ఎన్నికలైపోయి వారం రోజులవుతోంది. వెంటనే పరిషత్ ఎన్నికలు నిర్వహించకుండా ఐదు రోజులు ఎల్టీసీపై వెళ్ళటం ఏమిటంటూ గవర్నర్ దగ్గర ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో ఎవరో కోర్టులో పిటీషన్ కూడా వేశారు. దీనిపై కోర్టు విచారణ మొదలుపెట్టింది. ఈ విషయాలను పక్కనపెట్టేస్తే మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణలు నిమ్మగడ్డపై ప్రివిలేజ్ కమిటికి ఫిర్యాదుచేశారు. దాంతో కమిటి వ్యక్తిగతంగా నిమ్మగడ్డను విచారణకు హాజరవ్వటానికి రెడీగా ఉండమని నోటీసిచ్చింది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరవ్వాలని స్పష్టంగా చెప్పింది. కాబట్టి ప్రివిలేజ్ కమిటి ముందు నిమ్మగడ్డ గట్టిగా తగులుకున్నట్లే. అసలు పరిషత్ ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ ఎందుకు మాట్లాడటం లేదన్నదే అర్ధం కావటంలేదు. మొత్తానికి నిమ్మగడ్డ రిటైర్మెంట్ జీవితం అంత ప్రశాంతంగా గడిచేట్లయితే లేదు. మరి చూద్దాం ఏమి జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: