వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు, నేరుగా కేసీఆర్ నే ఢీకొనేందుకు ప్రణాళిక రచించారు. అధికార టీఆర్ఎస్ పైనే విమర్శలు ఎక్కుపెట్టి దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో షర్మిల, మంత్రి కేటీఆర్ ని మరీ తీసిపడేసేలా గతంలో ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కేటీఆరా..? అంటే ఎవరు, సీఎం కేసీఆర్ కొడుకా..? అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అయితే ఆ విషయాన్ని షర్మిల అక్కడితో వదిలిపెట్టలేదు. తాజాగా కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆమె వేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది.

కేసీఆర్ కొడుకు కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మరోసారి సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చారు షర్మిల. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూనే.. తనదైన శైలిలో నిరుద్యోగుల సమస్యల్ని ప్రస్తావించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చిత్తశుద్ధిని, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ చేసే మనసుని కేటీఆర్ కి భగవవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నట్టు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు షర్మిల.


 

అక్కడితో ఆ వ్యవహారం ఆగిపోయిందనుకుంటే పొరపాటే. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. కేటీఆర్ అభిమానులంతా ఓ రేంజ్ లో షర్మిలని ట్రోలింగ్ చేశారు. పరోక్షంగా జగన్ ని సీన్ లోకి తీసుకొచ్చారు. కేటీఆర్ ని విమర్శిస్తే ఊరుకునేది లేదని ఘాటుగా బదులిచ్చారు. ఈ ట్రోలింగ్ తో వెనకడుగేశారో లేక, ఇంకేదైనా కారణం ఉందో తెలియదు కానీ, కేటీఆర్ పై తాను వేసిన ట్వీట్ ని వెంటనే డిలీట్ చేశారు షర్మిల. దీంతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది. షర్మిల  భయపడ్డారని, అందుకే ట్వీట్ డిలీట్ చేశారని కామెంట్లు పడ్డాయి. ట్వీట్ వేసే ధైర్యం లేనివారు రేపు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారంటూ లాజిక్ తీశారు చాలామంది.




ట్రోలింగ్ మొదలు కావడంతో నేరుగా షర్మిల రియాక్ట్ అయ్యారు. పాత ట్వీట్ ని రీపోస్ట్ చేస్తున్నా చూడండి అంటూ మరోసారి అదే ట్వీట్ ని పోస్ట్ చేశారు. దీంతో మరోసారి కేటీఆర్ అభిమానులు షర్మిలను టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెట్టడం మొదలు పెట్టారు. మొత్తానికి కేసీఆర్ కొడుకు కేటీఆర్ అంటూ షర్మిల చేసిన ట్వీట్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ట్వీట్ వేయడం, తీయడం, మళ్లీ రీపోస్ట్ చేయడంతో.. షర్మిల ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. అయితే షర్మిల అభిమానులు, వైఎస్సార్టీపీ నేతలు ఆమెకు మద్దతుగా ట్వీట్లు వేస్తున్నారు. కేటీఆర్ అభిమానులకు కౌంటర్ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: