2011లో ఇండియాలో పేదరికం 22.5శాతంగా ఉండేది.. అలాంటి పేదరికం ఈ పదేళ్లలో బాగా తగ్గింది. 2019 నాటికి ఇండియాలో పేదరికం 10.2 శాతానికి పడిపోయినట్లు ప్రపంచ బ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. అంటే.. 2011-19 మధ్య కాలంలో 12.3 శాతం పాయింట్లు తగ్గిపోయిందన్నమాట. మరో శుభవార్త ఏంటంటే.. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో.. పేదరికం గణనీయంగా తగ్గిందట. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు ఓ పరిశోధన నివేదికను వెల్లడించింది.
ఇండియాలో 2011లో ఉన్న26.3 శాతం నుంచి 2019లో 11.6 శాతానికి పేదరికం దిగజారినట్లు ప్రపంచ బ్యాంకు చెబుతోంది. అదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో 14.2 శాతం నుంచి 6.3 శాతానికి పేదరికం తగ్గిందని ప్రపంచ బ్యాంకు వివరించింది. 2011-19 మధ్య గ్రామీణ, పట్టణ పేదరికం 14.7, 7.9 శాతం పాయింట్లు తగ్గాయని ప్రపంచ బ్యాంకు నివేదిక చెబుతోంది. ఇంకా ఏం చెబుతుందంటే.. భారత్ లోని చిన్న కమతాలున్న రైతులు అధిక లాభాలు గడించారట.
2013, 2019లో చేసిన రెండు సర్వేల ప్రకారం పెద్ద కమతాలున్న రైతుల వార్షిక ఆదాయం 2 శాతం మేర పెరిగిందట. అయితే.. చిన్న రైతుల ఆదాయం పది శాతం మేర వృద్ధి చెందినట్లు ప్రపంచ బ్యాంకు చెబుతోంది. అంటే చిన్న రైతులే ఎక్కువగా లాభపడుతున్నారన్నమాట. ప్రపంచ బ్యాంకుకు చెందిన ఆర్థికవేత్తలు సుతీర్థ సిన్హా రాయ్, రాయ్ వాన్ డెర్ వీడ్ ఇద్దరూ సంయుక్తంగా ఈ ప్రపంచ బ్యాంకు నివేదికను రూపొందించారు. ప్రపంచం దృష్టిలో ఇండియాపై మారుతున్న అంచనాలకు ఈ ప్రపంచ బ్యాంకు నివేదిక అద్దం పడుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి