తెలంగాణ రాష్ట్రం.. దాదాపు 60 ఏళ్ల కలల సాకారం. 1969లో ఉవ్వెత్తున లేచిన ఉద్యమంలో దాదాపు 400మంది వరకూ యువకుల ప్రాణాలు కోల్పోయారు.. కానీ.. అప్పట్లో ఇందిరా గాంధీ ఏమాత్రం కనికరించకుండా రాష్ట్ర విభజనకు ఒప్పుకోలేదు.. మళ్లీ అదే కాంగ్రెస్ పార్టీ 2009లో మాత్రం తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించింది. 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పాటు కల సాకారం అయ్యింది.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక రంగాల్లో అభివృద్ధి జరుగుతోంది. ప్రత్యేకించి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన లెక్కలు ఈ విషయం చెబుతున్నాయి. పెరిగిన నీటి వసతితో 2014లో కోటీ 34 లక్షల ఎకరాలు ఉన్న సాగువిస్తీర్ణం 2 కోట్ల 3 లక్షల ఎకరాలకు పెరిగింది. kcr నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏకంగా లక్షన్నర కోట్లు వెచ్చించింది. అలాగే వ్యవసాయం రంగంలో విద్యుత్ మౌలిక సదుపాయాల కోసం కూడా కేసీఆర్ ప్రభుత్వం గణనీయంగా ఖర్చు చేసింది. దాదాపు 28వేల473 కోట్లు విద్యుత్ రంగంలో ఖర్చు చేసింది.


వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ కోసం ఏటా 10వేల 500 కోట్లు భరిస్తోంది. అలాగే రైతుబంధు పథకంలో భాగంగా ఎకరానికి.... ఏడాదికి 10 వేలు చొప్పున అందిస్తోంది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 50వేల447 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేసింది. రేపటి నుంచి తొమ్మిదో విడత రైతుబంధు నిధులు జమచేయనుంది. అలాగే రైతుబీమా ద్వారా ఇప్పటివరకు 83వేల 118 మంది రైతుకుటుంబాలకు రూ.4,150కోట్లు రూపాయల పరిహారం అందించారు.


అలాగే రైతులు ఏ పంటలు వేయాలో సీజన్ కు ముందే రైతులకు సూచించేందుకు దేశంలోనే తొలిసారి మార్కెట్ రీసర్చ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడంలో భాగంగా ఆయిల్ పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ పంటలను పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. మొత్తం మీద తెలంగాణ వచ్చాక సాగు రంగం బాగా అభివృద్ధి చెందిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: