
ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గేని నియమించి కాంగ్రెస్ దళిత కార్డును ప్రచారంలోకి తీసుకువచ్చింది. ఒక దళితుడిని ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిని చేసి మా పార్టీలోనే అన్ని వర్గాలకు సమన్యాయం అని చెప్తోంది. దీనికి ప్రతిగా నరేంద్ర మోదీ ఇప్పుడు బీసీ రాగాన్ని ఎత్తుకున్నారు. గతంలో నేను సామాన్యుడిని, చాయ్ వాలాను అని చెప్పి ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ కు నేనంటే ఎనలేని ద్వేషం అని ప్రధాని ఆరోపించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేదలపై ఆ పార్టీ చిన్నచూపు చూస్తోందని వ్యాఖ్యానించారు. నేను బీసీని కాబట్టే ఆ పార్టీ నేతలు నోటికొచ్చినట్లు నన్ను తిడుతుంటారు. నిజానికి వారు అవమానించేది నన్ను కాదు బీసీలను అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అభ్యంతరకర వ్యాఖ్యల్లో ఆ పార్టీ నేతలను కోర్టు శిక్షించినా వారి వైఖరిలో మార్పు రాలేదన్నారు. అప్పట్లో దళితుడైన రామ్ నాథ్ కోవింద్ అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. తాజాగా ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము విషయంలోను అలాగే వ్యవహరించిందన్నారు.
వారికి ఆయా సామాజిక వర్గాల పై ద్వేషమే దీనికి కారణం తప్ప సైద్ధాంతిక విభేదాలు లేవన్నారు. అందుకే ఎస్.ఎన్.సిన్హా వంటి వారిని బరిలో దింపారని ఛత్తీస్ గడ్‌లో నిర్వహించిన ప్రచార సభలో వ్యాఖ్యానించారు. మహిళా బిల్లు తీసుకువచ్చానని కూడా వారు నాపై గుర్రుగా ఉన్నారని తెలిపారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఈసారి జాతీయ రాజకీయాలు కూడా కులాల సంక్లిష్టత వైపు వెళ్తున్నాయి అనిపిస్తోంది.