వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు షర్మిళ చివరి వరకు ప్రయత్నించారు. ఆ తర్వాత పోటీ చేస్తామని చెప్పి.. మళ్లీ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. టీడీపీ కూడా ఈ సారి ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో బీజేపీ జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్లు చెప్పి అందరినీ షాక్ కు గురి చేసింది.
ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు టీడీపీ ఓటర్లు ఎటువైపు ఉంటారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసు తో పాటు మరి కొన్ని కేసుల్లో ఇరక్కొని చంద్రబాబు ఆ వ్యవహారంలో ఎలా బయటకు రావాలని తలామునకలై ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో దృష్టి సారించలేమని పోటీకి దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. ఏపీలో టీడీపీతో జనసేన పొత్తులో ఉంది కాబట్టి ఆ ఓట్లన్నీ జనసేన బీజేపీ కూటమికి పడతాయా అంటే ప్రశ్నార్థకమే.
అయితే టీడీపీ మాత్రం ఏ పార్టీకి మద్దతు ప్రకటించలేదు. మరోవైపు తమ మిత్రపక్షమైన జనసేనకు ఓటు వేయాలని ఎక్కడా పిలుపునివ్వలేదు. కాబట్టి టీడీపీ కార్యకర్తలే ఆత్మ ప్రభోద చేసుకొని ఏదో ఒక పార్టీకి ఓటేయాలి. అయితే ఆంధ్ర రాజకీయ పరిస్థితులు ఇక్కడ లేవు కాబట్టి స్థానిక పరిస్థితులకు అనుకూలంగా టీడీపీ సానుభూతి పరులు ఓటేసే అవకాశం ఉంది. మరోవైపు చంద్రబాబు కూడా ఫలానా పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించే పరిస్థితి లేదు. అందువల్ల టీడీపీ ఓటుబ్యాంకు ఎటైనా మరలవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి