రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు చెప్పడానికి ఎన్నో ఉదంతాలు కనిపిస్తాయి. అలాంటిదే తెలంగాణ ఫలితాల్లో మరొకటి కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా కామారెడ్డి నుంచి కాటిపల్లి రమణారెడ్డి బరిలో నిలిచారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అక్కడ ఆయనకు ప్రత్యర్థులుగా కాంగ్రెస్ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉంటే బీఆర్ఎస్ నుంచి ఏకంగా సీఎం కేసీఆర్ ఉన్నారు.


వీళ్లదరిలో గెలుపు ఎవరిది అని అంచనా వేస్తున్న సమయంలో అనూహ్యంగా రమాణారెడ్డి గెలిచి ఔరా అనిపించారు. కొడితే కుంభస్థాలాన్నే బద్దలు కొట్టాలి అనే విధంగా ఏకంగా ఇద్దరు రాజకీయ ఉద్దండుల్ని ఓడించి.. దేశ ప్రజలను తన వైపు తిప్పుకున్నారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి నువ్వా నేనా అన్నట్లు ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ముక్కోణపు పోటీలో అనూహ్యంగా కమలం అభ్యర్థి గెలుపొందడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.


ఆయన ఓడించిన ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరు ముఖ్యమంత్రి అవకాశాలు మెండుగా ఉన్న రేవంత్ రెడ్డి అయితే మరొకరు తాజా మాజీ సీఎం కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈయన పేరు ప్రతి చోటా వినిపిస్తోంది. సోషల్ మీడియాను ఊపేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షించి జెయింట్ కిల్లర్ గా నిలిచారు.


అయితే ఎన్నికల సందర్భంగా కాటిపల్లి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ భాజపా అభ్యర్థి పేరు ఏంటని పక్కన ఉన్న వాళ్లని అడిగారు. ఆయనకు వెంకటరమణారెడ్డి పేరు తెలిసినా కావాలనే అవహేళనగా మాట్లాడారు. దీనికి కాటపల్లి బదులిస్తూ తన పేరును అడిగినప్పుడు ఎవరతను అంటూ కేటీఆర్ పక్కన ఉన్న వాళ్లను అడిగారనీ.. ఆయన పక్కన ఏమీ తెలియని పిచ్చోళ్లు ఉంటారు. నా పక్కన మాత్రం అంతా మంచి వాళ్లే ఉంటారు. గుర్తు పెట్టుకోండి ఈ ఎన్నికల్లో మీకు, మీ నాయనకు యావజ్జీవితం నేను, నా పేరు జ్ఞాపకం ఉంటా అంటూ వ్యాఖ్యానించారు. అన్నట్లుగానే చెప్పి మరీ కేసీఆర్ ను ఓడగొట్టారు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: