చంద్రయాన్-3 ఇది పేరు కాదు. భారతదేశపు కీర్తి. ఎన్నో ఏళ్ల కృషికి ఫలితమే చంద్రయాన్-3 విజయం. చందమామపై ఉన్న పూర్తి సమాచారాన్ని కనుగొనేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో. ఇందులో కీలక పాత్ర పోషించింది ప్రోపల్షన్ మాడ్యూల్.  దీనిని తిరిగి భూమిపై తీసుకొచ్చేందుకు ఇస్రో శ్రీకారం చుట్టింది. తన కక్ష్యను మార్చుకొని భూమిపైకి తీసుకొచ్చే సరికొత్త ప్రయోగంపై దృష్టి సారించింది.


అయితే చంద్రయాన్-3 ప్రోపల్షన్ మాడ్యూల్ కక్ష్యను విజయవంతంగా మార్చామని ఇస్రో ఇటీవల ప్రకటించింది. జాబిల్లి  కక్ష్య లో ఉన్న మాడ్యూల్ ను భూ కక్ష్య లోకి తీసుకొచ్చే అరుదైన ప్రయోగంలో విజయవంతం అయ్యామని తెలిపింది. ఇందుకు గాను ఒక కక్ష్య పెంపు విన్యాసం, ఒక ట్రాన్స్ ఎర్త్ ఉత్తేజిత ప్రక్రియ వినియోగించినట్లు తెలిపింది. జియో స్టేషనరీ ట్రన్స్ఫర్ ఆర్బిట్ నుంచి చివరి చంద్ర ధ్రువ  వృత్తాకార కక్ష్యకు ల్యాండర్  మాడ్యూల్ ను మార్చడం మరియు ఉద్దేశించిన విధంగా విభజనను విజయవంతంగా సాధించడం ద్వారా మాడ్యూల్ ప్రధాన లక్ష్యం నెరవేరింది.


విభజన తర్వాత పీఎం లోపల ఎస్ హెచ్ ఏపీఈ నిర్వహించిందని ప్రకటించింది. వాస్తవానికి ఎంపీ మిషన్ ను మూడు నెలల ఆపరేషన్ కోసం నిర్ణయించారు. ఇది నెల కంటే ఎక్కువ సమయం మాత్రమే పనిచేసింది.  దీనిలోని పరికరాల సాయంతో శాస్త్రవేత్తలకు ప్రొపల్షన్ మాడ్యూల్ ద్వారా సమాచారాన్ని పంపింది.  కాకపోతే మాడ్యూల్ లో  100 కిలోల ఇంధనం మిగిలిపోయింది. దీనిని వాడుకొని ఇస్రో మరిన్ని పరిశోధనలు పూర్తి చేసింది.


తాజాగా చందమామ కక్ష్య నుంచి దీని మార్గాన్ని భూ కక్ష్య వైపు మళ్లించారు. ఇది ప్రత్యేక ప్రయోగమని.. తమ ప్రణాళికలో ఇది లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. జాబిల్లి ఉపరితలం నుంచి నమూనాలు సేకరించే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపిన ఇస్రో.. తాజా ప్రయోగం ఆ మిషన్ కు దోహదపడుతుందని తెలిపింది. దీనిద్వారా ఇస్రో రికార్డు సృష్టించినట్లయింది. చందమామపై వస్తువులు పంపడమే కాదు వాటిని తిరిగి భూమిపైకి తీసుకురాగలమని నిరూపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: