పార్టీ ప్రక్షాలన దిశగా వైసీసీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్ననిర్ణయాలు అంతిమంగా పార్టీకి  మేలు చేస్తాయా.. లేక నష్టం చేస్తాయా అనేదానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.  ఇంతకాలం పార్టీ ఎమ్మెల్యేలపై నిఘా పెట్టని అధిష్ఠానం ఒక్కసారిగా వారిని మార్చడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ మార్పులకు మూల కారణం తెలంగాణ ఫలితాలే అని స్పష్టమవుతుంది.


సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా కేసీఆర్ అభ్యర్థులను మార్చకపోవడంతోనే ఓటమి చెందారని పలు సర్వేలు స్పష్టం చేశాయి.  ఒక ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చినా ఫలితాలు మరోలా ఉండేవని ఆ పార్టీ నాయకులే అభిప్రాయపడుతున్నారు.  దీంతో అప్రమత్తమైన జగన్  దీనిని అధిగమించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పునకు శ్రీకారం చుట్టారు. అయితే ఇది ఏ మేరకు ఫలితాలు ఇస్తుందో చూడాలి.  


అయితే టికెట్ రాని నేతలు వైసీపీలోనే ఉంటారా లేక పార్టీ మారతారా.. లేదా రెబల్స్ గా నామినేషన్లు వేస్తారా అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.  తెలంగాణలో అయితే ఆ పాటికే జంపింగ్ లు జరిగిపోయేవి. ఏపీతో పోల్చితే తెలంగాణలో  రాజకీయ అవకాశాలు అపారం.  ఏపీలో  ఆ పరిస్థితి లేదు. అయితే టీడీపీ లేకుంటే వైసీపీ.


ఉదాహరణకు ఆళ్ల రామకృష్ణారెడ్డిని తీసుకుంటే నిన్న మొన్నటి వరకు టీడీపీని, నారా లోకేశ్ ని, చంద్రబాబుని  తూర్పార పట్టిన ఆయన మళ్లీ టీడీపీలో చేరగలరా. ప్రస్తుతం టీడీపీ, జనసేన కూటమిలో ఉన్నాయి. టికెట్ ఎవరికీ వస్తుందో ఆ  పార్టీ నాయకులకే స్పష్టత లేదు.  ఈ నేపథ్యంలో పార్టీ మారినా ప్రయోజనం ఏంటనే లెక్కలు కొంతమంది వేసుకుంటున్నారు.  ఒకవేళ ఈ కూటమిలోకి బీజేపీ వస్తే ఈ సమస్య ఇంకా జఠిలం అవుతుంది. మరోవైపు టీడీపీలో కూడా వేళ్లూనికొని ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్లని కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్ ఇచ్చే సాహసం చంద్రబాబు చేయరు.  అందువల్ల పార్టీ మారే నాయకులు స్తబ్ధుగా ఉండే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: