ఏపీలో ఈ సారి దాదాపుగా రెండు నెలల పాటు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం సాగింది. అభ్యర్థుల జేబులకు చిల్లు అన్నట్లు ప్రచారం అదే తీరున సాగిపోయింది. అభ్యర్థులు అంతా మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు అదే టెంపో కొనసాగించడానికి నానా అవస్థలు పడ్డారనేది వాస్తవం. మొత్తం మీద మూడు ప్రాంతీయ పార్టీలు, రెండు జాతీయ పార్టీల పాటు వామపక్షాలు, ఇతర చిన్న చిన్న పార్టీలతో ఏపీ ప్రచారం హోరెత్తింది.


శనివారం సాయంత్రం ఆరుగంటలతో ప్రచారం మొత్తం మూగబోయింది. ఈ ఎన్నికల్లో ప్రచారం ఆద్యంతం ఆసక్తిగానే సాగింది. వన్ సైడెడ్ గా కాకుండా ప్రజలు కూడా రెండు పార్టీల ప్రచార సభలకు, రోడ్ షోలకు విపరీతంగా వచ్చారు. దీంతో ఈ సారి ఓటరు నాడి పట్టుకోవడం పలు సర్వే సంస్థలకు కష్టంగా మారింది.


ఈ సారి ఎన్నికల ప్రచార శైలిని పరిశీలిస్తే.. ఎన్నికల సభ అనగానే రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడం అనేది సహజంగా జరిగేదే. ఈ దఫాలో బీజేపీ అగ్ర నేతలు మాత్రమే బహిరంగ సభలు నిర్వహించారు. రాజకీయ నాయకుల ప్రచార స్టైల్ ని పరిశీలించినట్లయితే.. పవన్ అనగానే ఆవేశం గుర్తుకు వస్తుంది. తన ఆవేశపూరిత ప్రసంగాలతో ప్రజలను ఉత్తేజ పరుస్తూ ఉంటారు. బీజేపీ అగ్ర నాయకుల తీరు చూస్తే వీళ్లు హిందీలో ట్రాన్సలేటర్లు తెలుగులో అన్నట్లు సాగింది.


ఇక చంద్రబాబు, జగన్ విషయానికొస్తే.. ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ప్రచారం నిర్వహించారు. ఎక్కడికక్కడ రోడ్ షోలు నిర్వహిస్తూ.. తమ రాజకీయ ప్రసంగాల్లో ప్రజలను భాగస్వాములను చేశారు. చంద్రబాబు ఇదంతా నిజం కాదా తమ్ముళ్లు..  అవునా కాదా అని నేను అడుగుతున్నా.  మీరే సమాధానం చెప్పండి తమ్ముళ్లు..అంటూ జగన్ పై విమర్శలు గుప్పించారు. ఇక జగన్ విషయానికొస్తే.. ప్రతి సభలోను గత ఎన్నికల మ్యానిఫెస్టోలో చంద్రబాబు చెప్పింది చేశారా.. అంటూ ప్రశ్నించడం.. నేను చెప్పింది చేశానా లేదా అంటూ అడగడం వస్తే చేతులు పైకి ఎత్తండి అంటూ ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ప్రచారం చేశారు. మరి ఓటర్లు ఎవరికీ ఆకర్షితులయ్యారో జూన్ 4న తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: