చిన్న వయసులో జ‌రిగిన‌ అవమానం వల్ల తీసుకున్న నిర్ణయం ఓ యువకుడిని కలెక్టర్ స్థాయికి తీసుకు వెళ్ళింది. అతడిని అవమానించిన వారి నోర్లను యువకుడు సక్సెస్ తో మూయించాడు. ఇంతకీ ఆ యువకుడు ఎవరు... కలెక్టర్ స్థాయికి చేరుకునేందుకు ఎలా కష్టపడ్డాడు అన్నది ఇప్పుడు చూద్దాం... ప్రస్తుతం కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గోవింద్ జైస్వాలే ఆ వ్యక్తి. గోవింద్ జైస్వాల్ తండ్రి నారాయణ జైస్వాల్ ఓ ప్రభుత్వ రేషన్ దుకాణం లో పని చేసేవాడు. అయితే కొంతకాలానికి సడన్ గా అత‌డి ఉద్యోగం పోయింది. దాంతో ఏం చేయాలో అర్థం కాక అప్పటివరకు కూడబెట్టిన డబ్బుతో రిక్షాలను కొన్నాడు. ఆ రిక్షాల‌ను కొంతమంది వ్యక్తులకు కిరాయికి ఇచ్చి నడిపించేవాడు. అలా కొద్దిరోజులకు డబ్బు సంపాదించి ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్నాడు. అలా సంపాధించిన‌ డబ్బుతో ఒక స్థలాన్ని కూడా కొనుగోలు చేశాడు. 

అప్పుడప్పుడే ఆర్థికంగా స్థిరపడుతున్న నారాయణ జైస్వాల్ ను విధి వెక్కిరించింది. అతని భార్య తీవ్ర అనారోగ్యానికి గురైంది. దాంతో సంపాదించిన డబ్బుతో పాటు భూమిని అమ్మి భార్య ఆరోగ్యం కోసం ఖ‌ర్చు చేశాడు. అయినప్పటికీ నారాయణ జైస్వాల్ భార్య అనారోగ్యంతో కన్నుమూసింది. ఆ తర్వాత తానే సొంతంగా రిక్షా తొక్కుతూ నారాయ‌ణ జైస్వాల్ కుటుంబాన్ని పోషించాడు. కూతుళ్ల‌ పెళ్లిళ్లు చేశాడు. అంతే కాకుండా తాను పడిన కష్టాలు తన కొడుకు పడకూడదని ఎంతో కష్టపడి చదివించాడు. ఇక దానికి తగ్గట్టుగా కొడుకు కూడా ఉన్నతమైన ఆలోచనలతో కలలుకన్నాడు. అయితే ఒకరోజు గోవింద్ కు త‌న‌ స్నేహితుడి ఇంట్లో అవమానం జరిగింది.

గోవింద్ తన స్నేహితుడి ఇంటికి వెళ్ళినప్పుడు వారు గోవింద్ తండ్రి రిక్షా తొక్కే వాడని స్నేహితుడి కుటుంబ సభ్యులు అవమానించారు. ఆ సమయంలోనే తాను ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఐపీఎస్ గా ఎదగాలని గోవింద్ నిర్ణ‌యించుకున్నాడు. ఇదే విషయాన్ని తండ్రికి కూడా చెప్పాడు. దాంతో రూ. 40 వేలు ఇచ్చి నారాయణ్ జైశ్వాల్ తన కుమారుడిని సివిల్స్ కోచింగ్ కు పంపించాడు. అలా సివిల్స్ కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్ళిన గోవింద్ మొదటి సారి సివిల్స్ పరీక్ష రాసి 2006 లో జాతీయ స్థాయిలో 48వ ర్యాంకు సాధించాడు. ఇక ప్రస్తుతం గోవింద్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా గోవాలో విధులు నిర్వహిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: