ఏపీ విద్యారంగంలో కీలక మార్పులు రాబోతున్నాయి. ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి ఏపీలో  నూతన విద్యా విధానం అమలు చేయబోతున్నారు. దీనికి అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్‌ ను అధికారులు తాజాగా పూర్తి చేశారు. ఇప్పటి వరకూ పాఠశాలలు ప్రధానంగా  ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ అంటూ ముడు కేటగిరీల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇకపై ఏపీలో విడతల వారీగా ఆరు కేటగిరీల స్కూళ్లను ప్రారంభించబోతున్నారు. ఈ జులై నుంచి మొదటి విడతలో మ్యాపింగ్‌ చేసిన స్కూళ్లను  అధికారులు ప్రారంభించబోతున్నారు.


ఇలా మ్యాపింగ్ చేయడం ద్వారా తరగతి గదులు పెరుగుతాయి. అందుకు అవసరమైన తరగతి గదులను అందుబాటులో ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కావాల్సిన చోట్ల కొత్త తరగతి గదులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. పాఠశాల గదులు అందుబాటులోకి వస్తున్న కొద్దీ దశలవారీగా ఆరు రకాల స్కూళ్లను ప్రారంభించే  ప్రక్రియ కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. 2022 జులై, 2023 జులై, 2024 జులై... ఇలా దశలవారీగా ఈ 6 కేటగిరీల స్కూళ్లు ఏర్పాటు చేయబోతున్నారు.


దశలవారీగా ఏర్పాటవుతున్న స్కూళ్లకు అనుగుణంగా ఉపాధ్యాయులను కూడా విభజించబోతున్నారు.  సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నారు. జులై 2024 నాటికి సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టే కార్యక్రమం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ 1310 స్కూళ్లకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ కూడా అధికారులు పూర్తి చేయించారు. ఏపీలోని ప్రతి హైస్కూల్, హైస్కూల్‌ ప్లస్‌ స్కూళ్లన్నీ కూడా సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌తో ఉంచాలన్నది ప్రభుత్వ ఆలోచన.


ఏపీలోని ప్రతి హైస్కూల్, హైస్కూల్‌ ప్లస్‌ స్కూళ్లన్నీ కూడా సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌తో ఉంచాలని గతంలోనే సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అలాగే ఇంగ్లిషు పదాల ఉచ్ఛారణపై యాప్‌ను టీచర్లకు, విద్యార్థులకు త్వరలో అందుబాటులో తీసుకురాబోతున్నారు. ఈ యాప్‌ను విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లలో కూడా అందుబాటులో ఉంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతే కాదు.. విద్యావ్యవస్థలో లైంగిక వేధింపులపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. స్కూళ్లు, కాలేజీల్లో భద్రతపై ఇకపై మహిళా పోలీసులు అవగాహన కల్పించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: