
అలాగే డయేరియా(అతిసార) అనేది కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల వస్తుంది.పిల్లలకు విరోచనాలు అవుతుంటే ఎలక్ట్రాల్ పౌడర్‌ను మంచినీటిలో కలిపి తాగించాలి. తీవ్రమైన డయేరియా ఉన్నప్పుడు సీసా ద్వారా ద్రవాలు, యాంటీ బయాటిక్స్ ఇవ్వాలి. కేవలం ద్రవ పదార్థాలనే అందిస్తూ పిల్లలకు విశ్రాంతినివ్వాలి. దీని వల్ల త్వరగా కోలుకునే అవకాశముంది.అలాగే ఈ వర్షాకాలంలో టైపాయిడ్ కూడా ఎక్కువగా పిల్లలకు వస్తుంది. ఈ జ్వరం రావడానికి ప్రధాన కారణం కలుషిత నీరు,ఆహారం.ఇది త్వరగా సంక్రమించే వ్యాధి. దీర్ఘకాలంగా జ్వరం, కడుపులో నొప్పి, తలనొప్పి వస్తున్నట్లయిటే టైఫాయిడ్‌గా పరిగణించాలి. శరీరం మీద దద్దుర్లు కూడా వస్తాయి. పిల్లలకు వీలయినంత ఎక్కువగా ద్రవాలు ఇవ్వాలి. వాక్సినేషన్ చాలా వరకు ఈ వ్యాధిని నివారిస్తుంది.
వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు సాధారణ జలుబు వస్తుంది. జ్వరం, దగ్గు, జలుబు, ముక్కుకారడం, వళ్లునొప్పులు దీని లక్షణమని చెప్పుకోవచ్చు. ఎయిర్ కండీషనర్స్ వల్ల కూడా జలుబు రావచ్చు. కాబట్టి ఎయిర్ కండీషనర్స్ ఫిల్టర్స్ పరిశుభ్రంగా ఉండాలి. పిల్లల్లో అస్తమా రావడానికి జలుబు ఒక కారణంగా చెప్పవచ్చు. పిల్లికూతలు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే.. వెంటనే డాక్టరును సంప్రదించాలి. అలర్జీలు రాకుండా డాక్టరు సిఫారసు చేసిన మందులు వాడాలి. ఈ వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీరు తాగడం మంచిది.. !!