
వదులుగా ఉండే, సింథటిక్ దుస్తులకు బదులుగా కాటన్ దుస్తులు ధరించండి. టపాసులు కాల్చే ప్రదేశాలకు దూరంగా ఉండండి. దీపావళి సందర్భంగా స్వీట్లు అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా గర్భధారణ మధుమేహం (జెస్టేషనల్ డయాబెటిస్) ఉన్నవారు లేదా వచ్చే అవకాశం ఉన్నవారు స్వీట్లను పరిమితం చేయాలి. తక్కువ స్వీట్లు తీసుకోవడం, ఇంట్లో చేసుకున్న వాటికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.
నూనెలో వేయించిన, కారంగా ఉండే పదార్థాలు అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలను పెంచవచ్చు. వాటిని తినకుండా జాగ్రత్త వహించండి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. రోజుకు కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు లేదా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, తాజా పండ్ల రసాలు తీసుకోవడం చాలా అవసరం. పండుగ హడావిడిలో ఇంటిని శుభ్రం చేయడం, వంట పనులు, అతిథులను కలవడం వంటి వాటితో అలసిపోవడం సహజం.
గర్భిణీలు ఎక్కువ శ్రమ పడకుండా, తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. అలసటగా అనిపిస్తే లోతైన శ్వాస తీసుకోండి లేదా ధ్యానం చేయండి. కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి. పనులన్నీ మీరే చేయాలని ఒత్తిడికి గురికావద్దు. డాక్టరు సూచించిన పద్ధతులను పాటించండి. ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య అనిపించినా, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. సొంత వైద్యం చేసుకోకండి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ, గర్భిణీలు దీపావళి పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవచ్చు.