కోలీవుడ్ టాప్ హీరో సూర్య తన సినిమాల ఎంపిక విషయంలోనే కాకుండా తన లైఫ్ స్టైల్ విషయంలో కూడ నిరాడంబరంగా ఉంటాడు. దీనికితోడు అతడికి ఇండస్ట్రీలో చాల మంచి పేరుంది. ‘అగరం ఫౌండేషన్’ పేరుతో ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి సూర్య కుటుంబ సభ్యులు చాల సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
తల్లిదండ్రులు లేక అనాథలుగా మారిన పేద కుటుంబాలకు చెందిన వేలాది మంది చిన్నారులకు ఈ సంస్థ చదువు చెప్పిస్తోంది. వారి బాగోగులు చూస్తోంది. అయితే చాలామంది సినిమా సెలెబ్రెటీలు లాగా పబ్లిసిటీ కోసం కాకుండా చాలా సిన్సియర్ గా ‘అగరం’ను నడుపుతున్నారు సూర్య కుటుంబ సభ్యులు.
మరొక ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే స్వయంగా సూర్య కుటుంబమే కోట్లాది రూపాయలను ఈ ఫౌండేషన్ కోసం ఖర్చు పెడుతున్నారు. ఈ పరిస్థుతులలో ఈ ఫౌండేషన్ కోసం సూర్య కుటుంబ సభ్యులు చేసిన త్యాగం కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.
దశాబ్దాలుగా తాము ఉంటున్న ఇంటిని ‘అగరం’ ఫౌండేషన్ కు ఇచ్చేసింది సూర్య ఫ్యామిలీ. సూర్య తండ్రి శివకుమార్ ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు ఇది అని అంటారు. ఇక్కడే ఆయన దశాబ్దాలుగా ఉంటున్నారు. ఈ ఇంటిని చాలా సెంటిమెంటుగా భావిస్తాడు శివకుమార్.
అయితే ప్రస్తుతం సూర్య కుటుంబం అంతా కలిసి ఉంటున్న నేపధ్యంలో కుటుంబం పెద్దది కావడంతో అందరూ కలిసి ఉండటానికి ఇబ్బంది అవుతోందని మరో ఏరియాలో సూర్య ఫ్యామిలీ పెద్ద ఇల్లు కట్టుకుంది. దీనితో తమ పాత ఇంటిని అమ్మేయకుండా ‘అగరం ఫౌండేషన్’ కు ఇచ్చేసింది. కోట్లాది రూపాయల విలువైన ఇంటిని సూర్య ఫ్యామిలీ ఇలా స్వచ్ఛంద సేవకు కేటాయించడం ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ న్యూస్ గా మారి ప్రశంసలు అందుకుంటోంది..